Tuesday, April 7, 2020

"సీతారాముల కళ్యాణము చూతము రారండి"



"సీతారాముల కళ్యాణము చూతము రారండి" ఈ పాట మ్రోగని తెలుగింటి కళ్యాణము, రామాలయము తెలుగు నాట ఉండదంటే అతిశయోక్తి కాదు. ఎన్ ఏ టి వారి సీతారామ కళ్యాణం 1961 చిత్రములో సముద్రాల రాఘవాచార్య వ్రాసిన ఈ పాట అత్యంత ప్రాచుర్యం పొందింది.

ఇటువంటి పెళ్ళిపాటలు తెలుగింట అనాదిగా వస్తున్నవే..అలా వస్తున్న సంప్రదాయ గీతాన్ని ఆధారంగా వ్రాసిన గీతం ఇది.ఈ చిత్రానికి దాదాపు పది పండ్రెండేళ్ళ తరువాత తొలినాటి చిత్రాల సంగీత దర్శకుడు గాలి పెంచల నరసింహారావు సంగీతం చేసారు.అప్పటికే వయసు పైబడ్డ ఆయనకు సహాయకునిగా పూర్ణానందం వ్యవహరించారు.

గాలి పెంచల గా పిలివవబడే గాలి పెంచల నరసింహారావు గారు అంతకు ముందు 1950లవరకూ ప్రఖ్యాత తెలుగు సంగీత దర్శకుడు.ఆయన మొదటి చిత్రాలు ఆ చిత్రాల గీతాలు గుర్తుండకపోయినా ఈ కళ్యాణ గీతం ఎప్పటికీ తెలుగిళ్ళలో మారుమ్రోగుతూనే ఉంటుంది.


సీతారాముల కళ్యాణము చూతము రారండి
శ్రీ సీతారాముల కళ్యాణము చూతము రారండి

చరణం:

చూచువారలకు చూడముచ్చటట
పుణ్యపురుషులకు ధన్య భాగ్యమట 
భక్తి యుక్తులకు ముక్తి ప్రదమట.
సురలును మునులును చూడవచ్చునట

చరణం

దుర్జన కోటిని దర్పమడంచగ
సజ్జన కోటిని సంరక్షింపగ 
ధారుణి శాంతిని స్ధాపన చేయగ 
నరుడై పుట్టిన పురుషోత్తముని 

చరణం

దశరధరాజు సుతుడై వెలసి
కౌశికు యాగము రక్షణ చేసి 
జనకుని సభలో హరవిల్లు విరచి 
జానకి మనసు గెలిచిన రాముని 

చరణం

సిరి కళ్యాణపు బొట్టును బెట్టి
మణిబాసికమును నుదుటను గట్టి
పారాణిని పాదాలకు బెట్టి
పెళ్లి కూతురై వెలిసిన సీతా 

చరణం

సంపంగి నూనెను కురులకు దువ్వి
సొంపుగ కస్తూరి నామము దీర్చి
చెంప జవ్వాజి చుక్కను బెట్టి 
పెండ్లికొడుకై వెలసిన రాముని 

చరణం

జానకి దోసిట కెంపుల ప్రోవై
రాముని దోసిట నీలపు రాసై
ఆణిముత్యములు తలంబ్రాలుగా 
శిరముల మెరిసిన సీతారాములు.

ఈ చిత్రం తీసేప్పుడు రామారావు గారు దానిని ఒక క్రతువుగా భావించి మరీ తీసి అందులో రావణ పాత్ర ధరించారు. శ్రీరాముని గా హరనాథ్, సీతమ్మ గా మణి (ఆ తరువాత గీతాంజలిగా సుప్రసిద్ధులు) నటించారు.రామారావు గారికి దర్శకునిగా మొదటి చిత్రం ఇదే.

No comments:

Post a Comment