Wednesday, April 8, 2020

ప్రపంచ ప్రసిద్ద కృష్ణ మందిరం ఉడిపి బాల కృష్ణుడు

ఉడిపి దర్శనం.. సర్వపాప హరం

జగద్గురు, గీతాచార్యుడు భగవాన్‌ శ్రీకృష్ణుడు బాల కృష్ణుని రూపంలో వెలసిన క్షేత్రమే ఉడిపి. కర్ణాటక రాష్ట్రంలో ఒక జిల్లా. ప్రసిద్ధ కృష్ణమందిరం ఇక్కడ ఉంది. పూర్వం ఈ ప్రాంతాన్ని శివళ్లి అని పిలిచేవారు. ద్వైతమత స్థాపకులు శ్రీమధ్వాచార్యులు అవతరించిన స్థలం భాగ్యతక్షేత్రం. దానికి సమీపంలో ఉడిపి ఉంది. శ్రీమధ్వాచార్యులు శిష్యులతో కలిసి శ్రీకృష్ణుని విగ్రహ ప్ర‌తిష్ఠ‌ జరిపించారు. దీనికి సంబంధించిన గాథ ఒకటి ప్రచారంలో ఉంది.

శ్రీమధ్వాచార్యులు త‌న‌కున్న  దివ్యమహిమలతో తీవ్రమైన గాలివానకు సముద్రంలో మునిగిపోతున్న ఓడను రక్షించినప్పుడు ఓడలోని నావికుడు వీరికి గోపిచందనం మూటను కానుకగా సమర్పించాడు. అందులో చందనంతో పాటూ చిన్ని కృష్ణుని విగ్రహం ఉంది. ఈ విగ్రహాన్ని మధ్వాచార్యులు 800 సంవత్సరాల క్రితం ఉడిపి క్షేత్రంలో ప్రతిష్ఠించారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా ఉడిపిలో భక్తులకు గర్భాలయ దర్శనం లేదు. తొమ్మిది రంధ్రాలు ఉన్న కిటికీద్వారా స్వామివారిని దర్శించుకోవడం ఇక్కడి ప్రత్యేకత. తూర్పుముఖంగా ఉన్న కృష్ణుడు పశ్చిమాభిముఖుడై ఉండడం వెనుక ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. అంత్యకులానికి చెందిన కనకదాసు కృష్ణదర్శనం కోసం ప్రాధేయపడగా పూజారులు నిరాకరించారు. కనకదాసు భక్తిని మెచ్చిన కృష్ణుడు పడమరాభిముఖంగా దర్శనమిచ్చినట్లు స్థలపురాణం. కనకదాసుకు కనిపించిన కిటికిలో నుంచే నేటికీ భక్తులు స్వామివారిని దర్శించుకొంటారు. దీనిని కనకుడి కిటికీ అంటారు. కనకదాసు ప్రార్థించిన చోట దివ్యమండప నిర్మాణం చేశారు. దీనికే కనకదాసు మండపమని పేరు. శ్రీమధ్వాచార్యులు ఉడిపి దివ్యక్షేత్రంలో ఎనిమిది మఠాలను ఏర్పాటు చేశారు. వాటిలో శ్రీకృష్ణమఠం ఒకటి.

ఆలయానికి కుడివైపున శ్రీమధ్వతీర్థం ఉంది. తీర్థం మధ్యభాగంలో అందమైన మండపం ఉంది. అందులో శ్రీమధ్వాచార్యుల ప్రతిమ ఉంది. ఉత్సవాల సమయంలో ఇక్కడే స్వామివారికి తెప్పోత్సవం నిర్వహిస్తారు. తీర్థానికి ఒకవైపున భగీరథుని మందిరం, మరోవైపు చెన్నకేశవస్వామి మందిరం ఉన్నాయి. ప్రధాన ఆలయమంతా శ్రీకృష్ణుని లీలా విశేషాలు తెలిపే అందమైన తైలవర్ణచిత్రాలతో నిండి ఉంటుంది. గర్భాలయం ముందుభాగంలో వెండితో చేసిన ధ్వజస్తంభం ఉంది. దీనికి సమీపంలోనే తీర్థమండపం ఉంది. మండపంలోనే స్వామివారికి ఇష్టమైన అటుకులపొడిని ఉంచుతారు. పూజలు నిర్వహించే సమయంలో తీర్థమండపంలో జ్యోతులు వెలిగిస్తారు. ఆ సమయంలో మండపం శోభాయమానంగా ఉంటుంది.

గర్భాలయంలో కవ్వము, పిల్లనగ్రోవి చేతుల్లో ధరించిన శ్రీకృష్ణుని విగ్రహం దర్శనమిస్తుంది. గర్భాలయం బయట శ్రీమధ్వాచార్యుల విగ్రహం ఉంది. మరోపక్క శ్రీమధ్వాచార్య పీఠం ఉంది. ఆంజనేయస్వామి భవ్యమందిరంలో స్వామివారు వీరాంజనేయస్వామి అవతారంలో కన్పిస్తారు. ఇదే ప్రాంగణంలో సుబ్రమణ్యేశ్వరస్వామి కొలువుదీరాడు. నవగ్రహాలయం, గోశాల, గీతామందిరాలు ఉన్నాయి.

ఉడిపి వంటకాలు, హోటళ్లు విశేష ఆదరణ పొందాయి. శాకాహార వంటల్లో ఉడిపి శైలి వంటలు ప్రసిద్ధి చెందాయి. కర్ణాటక రాష్ట్రంతో పాటు దేశమంతటా ఉడిపి హోటళ్లు ఉన్నాయి. దక్షిణ భారతీయ శాకాహార వంటలు ఉడిపి ప్రత్యేకత
అష్ట మఠాలు

ఉడుపి శ్రీకృష్ణ మఠానికి అనుసంధానంగా అష్ట మఠాలు కృష్ణ మఠాలు ఉన్నాయి. ఈ ఎనిమిది మఠాలు ఉడుపి రథవీధిలో, శ్రీకృష్ణ దేవాలయానికి చుట్టూ ఉంటాయి.

పుత్తగె
పేజావర
పలిమారు
అదమారు
సోదె
శీరూరు
కాణియూరు
కృష్ణాపుర

దగ్గరలో ఉన్న మరికొన్ని ముఖ్య ప్రదేశాలు

కోల్లూరు ముకాంబికా దేవాలయం
మరవంతె బీచ్
మల్పే రేవు
కాపు దీపస్తంభం (కాపు లైటు హౌసు)
కార్కళ లోని గోమటేశ్వరుడు
వేణూరు లోని గోమటేశ్వరుడు
అత్తూరులో సెయింట్ లారెన్స్ ఇగర్జి
సెయింట్ మేరీస్ ద్వీపం
మూడబిదరెలో సావిరకంబద బసది
మణిపాల్
బైందూరు కోసళ్ళి జలపాతము

ఉడిపి జిల్లా రెండు జాతీయరహదార్లు ఉన్నాయి. జాతీయరహదారి17 (ప్రస్తుతం జాతీయరహదారి 66 అని మాత్చబడింది) మరియు రెండవది జాతీయరహదారి 13. జాతీయరహదారి 17 జిల్లా ఉత్తర దక్షిణ దిశగా పయనిస్తూ ఉడిపిని మంగుళూరు, కార్వార్, మురుదేష్వర, కొచ్చి, మద్గావ్, గోవా రత్నగిరి మరియు ముంబయితో అనుసంధానిస్తుంది. జాతీయరహదారి 13 జిల్లాను షిమొగా, బీజపూర్, సోలాపూర్, చిత్రదుర్గ మరియు హోస్పేటలతో అనుసంధానిస్తుంది.

కొంకణి రైల్వే జిల్లాను పొరుగు జిల్లాలు మరియు రాష్ట్రాలతో అనుసంధానిస్తుంది. జిల్లాలో ఉడిపి, బైందూర్, కుందపురె వద్ద ప్రధాన రైలు స్టేషన్లు ఉన్నాయి.

అన్ని వర్గాల వారికి వసతి భోజన సదుపాయాలు ఉన్నాయి

కర్ణాటక రాష్ట్రం బెంగుళూరుకు సుమారు 500 కిలోమీటర్లు దూరంలో ఉడిపి జిల్లాలో ఈ క్షేత్రముంది. ఈ క్షేత్రాన్ని చేరుకోవడానికి దేశంలోని అన్ని ప్రధాన కేంద్రాలనుంచి బస్సులు అందుబాటులో ఉన్నాయి. అలాగే హైద్రాబాద్ నుంచి మంగళూరుకు నేరుగా వచ్చి అక్కడనుంచి 80 కిలోమీటర్లు దూరంలో ఉన్న ఉడిపికి చేరుకోవచ్చు. ఈ క్షేత్ర దర్శనం పూర్వజన్మల పుణ్యఫలం.

No comments:

Post a Comment