Wednesday, April 8, 2020

గండి ఆంజనేయస్వామి దేవాలయం చరిత్ర

స్వయంగా  శ్రీరాముడే చెక్కిన శిల్పం

మనదేశంలో అత్యంత ప్రముఖంగా పేర్కొనదగిన హనుమత్‌క్షేత్రాలు చాలా  ఉన్నాయి. ఆ ఆలయాలలో హనుమ స్వయంభువుడై వెలిసినట్లు చెబుతారు.

 అయితే, కేవలం ఒక్కచోట మాత్రం హనుమకు ఆరాధ్యదైవమైన శ్రీరామచంద్రుడు తన బాణం మొనతో హనుమ ఆకారాన్ని చెక్కటం... తన స్వామి చెక్కిన ఆ చిత్రంలోకి హనుమ స్వయంగా వచ్చి నిలవడం కనిపిస్తుంది. అదే కడప జిల్లా వేంపల్లెకు దగ్గరలోని గండి ఆంజనేయస్వామి ఆలయం. 
 
శ్రీరాముడు లంకకు వెళ్లేటప్పుడు హనుమంతుడి తండ్రి అయిన వాయుదేవుడు ఈ ప్రాంతంలో తపోనిష్టుడై ఉన్నాడు. రాముడికి ఆశీస్సులు అందించిన వాయుదేవుడు, తిరుగు ప్రయాణంలో రావణుడిని సంహరించి వచ్చేటప్పుడు ఇదే మార్గంలో రావాలని కోరాడు. 

 వాయుదేవుని కోరిక ప్రకారం సింహళ (శ్రీలంక) విజయ యాత్ర ముగించుకొని తిరిగి వచ్చేటప్పుడు రాముడు తన పరివారంతో సహా ఒకరోజు ఇక్కడ బస చేశాడు.

 వాయుదేవుడు శ్రీరాముడికి స్వాగతం ఇవ్వడం కోసం రెండు కొండలకు మధ్యలో ఒక బంగారు తోరణం నిర్మించాడు.శ్రీరాముడు అక్కడ ఒకచోట విశ్రాంతి తీసుకుంటూ ఒక శిలపై తన బాణపు ఉలితో ఆంజనేయుడి రూపాన్ని చిత్రించాడు.

కాలి చిటికెన వేలిని చెక్కేలోగా రాహుకాలం రావడంతో అంతటితో వదిలేశాడట రాముడు. ఆ శిలను అక్కడినుంచి తరలిద్దామని చూడగా, వేలినుంచి రక్తం కారడంతో స్వామి వారక్కడ సజీవరూపులై ఉన్నారని తెలుసుకుని, చేసేదేమీ లేక ఆ స్థలంలోనే ఆలయాన్ని నిర్మించారట. అదే గండి వీరాంజనేయస్వామి దేవాలయం. 
ఇక్కడ స్వామివారి ఒక పాదానికి చిటికెనవేలు ఉండదు. ఆ చిటికెనవేలును చెక్కేందుకు ఎవరు ప్రయత్నించినా స్వామివారి విగ్రహం నుంచి రక్తం వస్తుంది. అందుకే ఇక్కడి మూర్తిని సజీవ ఆంజనేయ స్వామి మూర్తిగా పేర్కొంటారు. 


దేవతానుగ్రహం వల్ల పుణ్యాత్ములకు అవసాన దశలో ఆ బంగారు తోరణం కనిపిస్తుందని విశ్వాసం.

పవిత్ర పాపాఘ్ని నది
పాపాలను నశింపజేసేది కాబట్టి ఈ నదికి పాపాఘ్ని అని పేరు వచ్చింది.  పాపాఘ్ని నది గండి క్షేత్రంలో ఆంజనేయస్వామి ఆలయానికి ఎదుట దక్షిణం నుండి ఉత్తర ప్రవాహం ఉండటంతో మరింత ప్రాశస్త్యాన్ని సంతరించుకుంది.

ఏటా శ్రావణ మాసంలో ఇక్కడ శ్రావణ మాస ఉత్సవాలు జరుగుతాయి. 

 దుష్టశక్తులను తరిమికొట్టే దేవుడి గానే గాక సంతానప్రదాతగా కూడా స్వామికి పేరుంది. 

గండి ఆంజనేయస్వామిని కొలిస్తే సంతానం కలుగుతుందన్న నమ్మకం ఉండటంతో భక్తుల సందడి అధికంగా ఉంటుంది.

No comments:

Post a Comment