🌴. విద్యేశ్వర సంహితా 🌴
అధ్యాయము - 25
🌻. రుద్రాక్ష మహాత్మ్యము - 6 🌻
భైరవో నవవక్త్రశ్చ కపిలశ్చ మునిస్మ్సృతః | దుర్గా వా తదధిష్ఠాత్రీ నవరూపా మహేశ్వరీ || 74
తం ధారయే ద్వామహస్తే రుద్రాక్షం భక్తి తత్పరః | సర్వేష్వరో భవేన్నూనం మమ తుల్యో న సంశయః || 75
దశవక్త్రో మహేశాని స్వయం దేవో జనార్దనః | ధారణాత్తస్య దేవేశి సర్వాన్ కామానవాప్నుయాత్ || 76
ఏకాదశముఖో యస్తు రుద్రాక్షః పరమేశ్వరి | స రుద్రో ధారణాత్తస్య సర్వత్ర విజయీ భవేత్ || 77
తొమ్మిది ముఖముల రుద్రాక్ష భైరవుని స్వరూపమనియు, కపిలమహర్షి యొక్క స్వరూపమనియు చెప్పబడినది. తొమ్మిది రూపములతో విలసిల్లు దుర్గా మహేశ్వరి దానికి అధిష్ఠాన దేవత (74).
అట్టి రుద్రాక్షను భక్తితో ఎడవ చేతియందు ధరించు మానవుడు సర్వ సమర్థుడగుటయే గాక, నాతో సమానుడగుననుటలో సందేహము లేదు (75).
ఓ మహేశ్వరీ! పది ముఖముల రుద్రాక్ష సాక్షాత్తుగా జనార్దనుని స్వరూపము. ఓదేవీ! దానిని ధరించు మానవునకు కోర్కెలన్నియూ ఈడేరును (76).
ఓ పరమేశ్వరీ! పదకొండు ముఖములు గల రుద్రాక్ష రుద్రుని స్వరూపము. దానిని ధరించు వ్యక్తి అంతటా విజయమును పొందును (77).
ద్వాదశాస్యం తు రుద్రాక్షం ధారయేత్కే శదేశకే | ఆదిత్యాశ్చైవ తే సర్వే ద్వాదశైవ స్థితాస్తథా || 78
త్రయోదశముఖో విశ్వే దేవాస్తద్దారణాన్నరః | సర్వాన్ కామానవాప్నోతి సౌభాగ్యం మంగలం లభేత్ || 79
చతుర్దశముఖో యో హి రుద్రాక్షః పరమశ్శివః |ధారయేన్మూర్ద్నితం భక్త్యా సర్వ పాపం ప్రణశ్యతి || 80
ఇతి రుద్రాక్ష భేదా హి ప్రోక్తా వై ముఖభేదతః | తత్తన్మంత్రాన్ శృణు ప్రీత్యా క్రమాచ్ఛైలేశ్వరాత్మజే || 81
పన్నెండు ముఖముల రుద్రాక్షను కేశముల యందు ధరించవలెను. ద్వాదశాదిత్యులు దాని యందు ప్రతిష్ఠితులై ఉందురు (78).
పదమూడు ముఖముల రుద్రాక్షలు విశ్వేదేవతల స్వరూపము. వాటిని ధరించు మానవునకు కోర్కెలన్నియూ, ఈడేరి, సౌభాగ్యము మంగళములు కలుగును (79).
పదునాల్గు ముఖముల రుద్రాక్ష పరమశివుని స్వరూపము. దానిని భక్తితో శిరస్సుపై ధరించినచో, పాపములన్నియూ నశించును (80).
ఓ పార్వతీ! ముఖముల సంఖ్యను బట్టి రుద్రాక్షలలో గల భేదములను నీకు వివరించితిని. ఆయా రుద్రాక్షలకు సంబంధించిన మంత్రములను భక్తితో క్రమముగా వినుము (81).
ఓం హ్రీం నమః (1),
ఓం నమః (2),
ఓం క్లీం నమః (3),
ఓం హ్రీం నమః (4),
ఓం హ్రీం నమః (5),
ఓం హ్రీం హుం నమః (6)
ఓం హుం నమః (7),
ఓం హుం నమః (8),
ఓం హ్రీం హుం నమః (9),
ఓం హ్రీం నమః నమః (10),
ఓం హ్రీం హుం నమః (11),
ఓం క్రోం క్షౌం రౌం నమః (12),
ఓం హ్రీం నమః (13),
ఓం నమః (14).
అనునవి పదునాల్గు మంత్రములు.
భక్తి శ్రద్ధాయుతశ్చైవ సర్వకామార్థ సిద్దయే | రుద్రాక్షాన్ ధారయేన్మంత్రై ర్దేవనాలస్య వర్జితః || 82
వినా మంత్రేణ యో ధత్తే రుద్రాక్షం భువి మానవః | స యాతి నరకం ఘోరం యావదింద్రాశ్చతుర్దశ || 83
రుద్రాక్ష మాలినం దృష్ట్వా భూతప్రేత పిశాచకాః | డాకినీ శాకినీ చైవ యే చాన్యే ద్రాహకారకాః || 84
కృత్రిమం చైవ యత్కించి దభిచారాదికం చ యత్ | తత్సర్వం దూరతో యాతి దృష్ట్వా శంకిత విగ్రహమ్ || 85
సాధకుడు భక్తి శ్రద్ధలతో గూడినవాడై, సర్వకామనలు సిద్ధించుట కొరకై, జూదము మొదలగు వ్యసనములను, సోమరితనమును వీడి, మంత్ర పూర్వకముగా రుద్రాక్షలను ధరించవలెను (82).
మంత్రము లేకుండా రుద్రాక్షలను ధరించు మానవుడు పదునాలుగు ఇంద్రుల కాలమును నరకములో గడుపును (83).
రుద్రాక్ష మాలను ధరించిన వ్యక్తి ని చూచినచో, భూత ప్రేత పిశాచ డాకినీ శాకినీ మొదలగు, ద్రోహమును చేయు ప్రాణులు తొలగిపోవును (84).
చేతబడి మొదలగునవి కూడా రుద్రాక్షలను ధరించువానికి దూరముగా పోవును (85).
No comments:
Post a Comment