హిరణ్య కశిపుడు తపస్సుకి వెళ్ళినప్పుడు నారదుని ఆశ్రమములో లీలవతికి కుమారుడు కలిగాడు. ప్రహ్లాదుడు అని పేరు పెట్టారు. ఇతరులు సంతోషిస్తే సంతోషించే వాడు ప్రహ్లాదుడు. తనకి ఉన్నది ఒకరికి పెట్టి వారు సంతోషిస్తే ప్రహ్లాదుడు సంతోషిస్తాడు.
ఒకడు ఏడిస్తే చూచిసంతోషించి తానే అనుభవించి సంతోషిస్తాడు హిరణ్యకశిపుడు. లోకములో ఒక ధర్మము ఉన్నది. మంచి కొడుకు పుట్టాలి అంటే పుణ్యము చేసిన వాడి కడుపున పుడతాడా? పాపము చేసిన వాడి కడుపున పుడతాడా?
అటువంటి వాడి కడుపున పుట్టడానికి ప్రహ్లాదుడు చేసిన పాపము ఏమిటి? ? అటువంటి కొడుకు పుట్టడానికి హిరణ్యకశిపుడు చేసుకున్న పుణ్యము ఏమిటి? అన్న ప్రశ్న వస్తుంది కదా? భాగవతములోనే దీనికి జవాబు చెప్పారు. పుట్టుకతో నారదుని ఆశ్రయము లభించి అంత గొప్ప భక్తి తత్పరుడు కావడానికి కారణము ఎక్కడ ఉన్నది అంటే ప్రహ్లాదుని గత జన్మలలో సత్సంగము ఉన్నది.
ఏది ఉన్న లేకపోయినా సత్పురుషులతో కలసి ఉండి వారితో తిరిగి వారిని సేవించాడు. మనము ఎంత ధర్మము ఆచరించాము అన్నది పక్కన పెడితే సత్పురుషులతో కలసి ఉంటే చాలు ఈశ్వర అనుగ్రహము కలుగుతుంది. ఆయనతో మనము ఉన్నామన్నది ముఖ్యము కాదు. ఆయన మనను గుర్తుపట్టి పేరు పెట్టి పిలిచి పక్కన కూర్చోపెట్టుకోగలడా? ఏ కారణమునకైనా అలా ఉంచుకోగలిగితే వాడు ఉత్తర జన్మలలో మహాభక్తుడైపోతాడు. సత్సంగమే ప్రహ్లాదుడు అంతటి భక్తుడిగా పుట్టడానికి కారణము.
అహోబిల క్షేత్రములో నవనారసింహమై తొమ్మిదిమంది నరసింహులుగా ఉన్నాడు.
1. జ్వాలానరసింహుడు -- ఆయనే ఉగ్ర నరసింహ స్వరూపము. మొదటగా వచ్చిన తేజో స్వరూపము. హిరణ్యకశిపుని పొట్ట చీలుస్తున్న స్వరూపములో ఉంటాడు.
2. అహోబిలనరసింహస్వరూపము -- హిరణ్యకశిపుని సంహరించిన తరవాత కూర్చున్న స్వరూపము.
3. మాలోల నరసింహుడు -- లక్ష్మీదేవి చెంచు లక్ష్మిగా వస్తే ఆమెని స్వీకరించి ఎడమ తొడ మీద కూర్చో పెట్టుకున్న స్వరూపము.
4. కరంజ నరసింహుడు అని నాలగవ నరసింహుడు. ఆయన చెట్టుకింద ధ్యాన ముద్రలో ఉంటాడు.
5. పావన నరసింహుడు -- ఆయన దగ్గరకు వెళ్ళి ఒక్కసారి నమస్కారము చేస్తే ఎన్ని పాపములనైనా తీసేస్తాడు. మంగళములను ఇస్తాడు. అందుకని ఆయనని పావన నరసింహుడు అనిపిలుస్తారు.
6. యోగ నరసింహుడు అంటారు. అయ్యప్పస్వామి ఎలా కూర్చుంటారో అలా యోగపట్టముకట్టుకుని యోగముద్రలో కూర్చుంటాడు. ఇప్పటికి అక్కడకి దేవతలు కూడా వచ్చి ధ్యానము చేస్తారు అని చెపుతారు.
7. చత్రవట నరసింహస్వరుపము అంటారు. పెద్ద రావి చెట్టుకింద వీరాసనము వేసుకుని కూర్చుంటాడు. అక్కడకి హూ హ, హా హా అని ఇద్దరు గంధర్వులు శాపవిమోచనము కొరకు నరసింహస్వామి వద్దకి వచ్చి పాటలు పాడి నృత్యము చేసారు. ఆయన తొడమీద చెయ్యి వేసుకుని తాళము వేస్తూ కూర్చున్నారు. ఆ కూర్చున్న స్వరూపమును చత్రవట నరసింహస్వరూపము అంటారు అక్కడకు వెళ్ళి కొంతమంది పెద్దలు సంగీతము పాడుతుంటారు.
8. భార్గవ నరసింహుడు పరశురాముడు నరసింహ దర్శనము చెయ్యాలని కోరుకుంటే అనుగ్రహించి దర్శనము ఇచ్చిన స్వరూపము
9. వరాహ నరసింహస్వరూపము భూమిని తన దంష్ట్రమీద పెట్టుకుని పైకి ఎత్తినటువంటి స్వరూపము ఆదివరాహస్వామి పక్కన వెలసిన నరసింహస్వరూపము మొదటగా వచ్చిన యజ్ఞ వరాహస్వరూపము, నరసింహ స్వరూపము రెండు ఉంటాయి వరాహ నరసింహము. తొమ్మిది నరసింహస్వరూపములు అహోబలక్షేత్రములో ఉంటాయి.
No comments:
Post a Comment