Tuesday, April 7, 2020

నిజం వేరు, సత్యం వేరు

"నిజాలు, సత్యాలు ఈ రెండూ సాధనకు ఏవిధంగా ఉపకరిస్తాయి ?"

*నిజం వేరు, సత్యం వేరు ! బాహ్యరూపంలో పలు అవయవాలతో కనిపించే విగ్రహం మూల పదార్థమైనా సిమెంటు రూపంలో ఒక్కటే. మారనిది సత్యంగానూ, కనిపించే మార్పు నిజంగానూ అర్థం చేసుకోవటం వివేకం. భిన్నరూపాల్లో మార్పుగా కనిపించే విగ్రహాలకు, మారని మన అంతరంగమే మూలం. ఆ అంతరంగంలో శాశ్వత రూపంతో ఉన్న ఏకత్వమే సత్యం. 

భగవంతుడిని ఏ విగ్రహరూపంలో కొలిచినా అంతరంగంలో అది మనని ఆ ఏకత్వస్థితికే చేరుస్తుంది. ప్రస్తుతం 40 సంవత్సరాలున్న వ్యక్తిని పదేళ్లకు ముందు వయసు అడిగితే 30 సంవత్సరాలు అని చెప్తాడు. అతడి వయస్సులో, దేహంలో మార్పు వస్తుంది కానీ చిన్ననాటి నుండి వృద్ధాప్యం వరకు శరీరములో ఉండి నేను అంటున్న వ్యక్తి మాత్రం మార్పు లేకుండా నేనుగానే ఉంటాడు. 

మారుతున్నవి ఎప్పుడూ సత్యాలు కాలేవు. కనుక దేహం దాని వయసు కేవలం నిజాలేకానీ సత్యాలుకావు. నిజాలు కాలానికి బందీలు. సత్యం కాలాతీతమైనది. ఎప్పటికీ ఉండే ఆ నేను సత్యం. మార్పు చెందుతుండే దేహం అసత్యం. వైరాగ్యం అంటే అన్నీ వదులుకోవటం కాదు. 

నిజానికి, సత్యానికి ఉన్న తేడా గమనించగలగటమే వైరాగ్యం. మనకున్న ఇల్లు, కారు, భార్య, పిల్లలు నిజాలే కానీ సత్యాలు కావని గుర్తించటం వైరాగ్యంలో భాగమే !*_

{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}
'విగ్రహం గుడిలో, అనుగ్రహం మనలో..!'

No comments:

Post a Comment