ఒకసారీ అర్జునుడు శ్రీ కృష్ణుని ఇలా అడిగాడు...
కర్మలను వదిలివేయ మని ఒకసారీ, కర్మానుష్టానము చేయమని ఒక సారి చెప్తున్నావు. వీటిలో ఏది అనుసరించాలో చెప్పు..?
అప్పుడు శ్రీ కృష్ణుడు ఇలా చెప్పారు...
కర్మత్యాగం, నిష్కామకర్మ రెండూ శ్రేష్టమే ఐనా నిష్కామకర్మ ఉత్తమం. రాగద్వేషాది ద్వంద్వా భావాలు లేని వాడే నిజమైన సన్యాసి మరియు అలాంటి వారు మాత్రమే కర్మబంధాల నుండి తరిస్తారు.
జ్ఞానయోగం, కర్మయోగాలలో ఏది అవలంబించినా సరే ఒకటే ఫలితం ఉంటుంది. రెండూ ఒకటే అనే భావం కలిగి ఉండాలి. యోగియై సన్యసించిన వాడే బ్రహ్మజ్ఞానాన్ని పొందగలడు. నిష్కాముడు, శుద్దమనస్కుడు, ఇంద్రియనిగ్రహి అన్ని ప్రాణులను తనవలనే చూస్కునే వాడిని ఎలాంటి కర్మలు బంధించలేవు.
కర్మయోగి చూసినా, వినినా, తాకినా, వాసన చూసినా, నిద్రించినా, శ్వాసించినా, మాట్లాడుతున్నా ఆయా ఇంద్రియాలే వాటి విషయాల పని చేస్తున్నయను కుంటాడు కాని తానేమీ చేయడం లేదనే అనుభవం కలిగిఉంటాడు. ఫలితం పైన ఆశ లేక, ఈశ్వరార్పణంగా చేయుకర్మల వలన తామరాకుపై నీటి బొట్టు వలె పాపాలంటవు.
యోగులు అహంకారం లేక చిత్తశుద్ది కొరకు మాత్రమే కర్మలు చేస్తారు. ఫలాపేక్ష కలవారు కర్మలచే సంసారంలో బంధించ బడతారు. ఆత్మనిష్ఠుడు కర్మసంకల్పం చేయక, ఇతరులచే చేయింపక నవద్వారాలు గల ఈ శరీరంలో సుఖంగా ఉంటాడు.
కర్మ, కర్మ చేయడం, దాని ఫలితం ఆత్మ ప్రేరణ కాదు. ఆ ప్రేరణను మాయ చేస్తోంది. ఆత్మకు పాప పుణ్యాలతో సంబంధం లేదు. కాని అజ్ఞానం వలన ఆ భ్రాంతి కలుగుతోంది. ఆత్మజ్ఞానం ప్రాప్తి కలిగిన వారికి అజ్ఞానం నశించి పరమాత్మ దర్శనం కలుగుతుంది. బ్రహ్మజ్ఞాన ఆసక్తిపరులు తమ బుద్దినీ, మనుసునీ పరమాత్మ యందు నిలిపి మోక్షాన్ని పొందుతారు. విద్యావినయాలుగల బ్రహ్మజ్ఞాని బ్రాహ్మణుని యందు, చండాలుని యందు, ఆవు, కుక్క, ఏనుగు అన్నిటి యందు ఒకే దృష్టి కలిగి ఉంటాడు. అతడు ఈ జన్మలోనే పరబ్రహ్మను చేరుతాడు.
సుఖాలకు పొంగక, దుఃఖాలకు క్రుంగని స్థిరబుద్దికలవాడే నిజమైన బ్రాహ్మణుడు మరియు బ్రహ్మజ్ఞాని. అతడు బ్రహ్మాన్ని ఆత్మలోనే దర్శించి నిత్యమైన బ్రహ్మానందాన్ని పొందుతాడు. తాత్కాలికాలైన, దుఃఖకారకాలైన ఇంద్రియ సుఖాలను బ్రహ్మజ్ఞాని కోరడు. ఎవరైతే ఈ జన్మలోనే కామ క్రోధాలను జయిస్తారో వారు ఆత్మజ్ఞానం పొందుతారు.
ఎవరైతే స్వతంత్రుడై ఆత్మ యందే సుఖిస్తూ, ఆడుకుంటూ, ప్రకాశిస్తుంటారో, పాప పుణ్యాలను నశింప చేసుకొని జితేంద్రియుడై నిస్సందేహంగా ఉంటారో ఎల్లప్పుడూ అన్ని జీవుల సుఖం కోరువానికి మాత్రమే బ్రహ్మత్వం, బ్రహ్మానందం లభిస్తుంది. దృష్టిని భ్రూమధ్యంపై కేంద్రీకరించి ప్రాణ, అపాన మొదలగు వాయువులను సమం చేసి మనసు, బుద్ది, ఇంద్రియాలను స్వాధీనం చేస్కొని కోరిక, కోపం, భయం మొదలగు వాటిని విడిచిన జ్ఞాని ముక్తుడవుతాడు. తపస్సులకు, యాగాలకు నేనే భోక్తను.నేనే సర్వలోకాలకు అధిపతిని, దైవాన్ని, సర్వభూతహితుడను. నన్ను తెలుసుకున్న యోగి క్షేమాన్ని పొందుతాడు.
No comments:
Post a Comment