వేదవిద్యలో విదుషీమణి "గార్గి"
గార్గి పండితురాలు, బ్రహ్మజ్ఞాని. యాజ్ఞవల్క్యుడు అనే మహర్షితో వాద ప్రతివాదాలు చేసిన మహామనీషి ఆనాడూ, ఈనాడూ ఉపనయనం చేసుకోవటం పురుషులకే పరిమితం. అటువంటిది పురుషులతో పాటు సమంగా గార్గి కూడా ఉపనయనం చేసుకుంది. జందెం వేసుకుంది శాస్త్ర చర్చ చేసింది. మిధిలా నగర రాజైన జనకుని సభలో ఆస్థాన పండితురాలిగా ఎంతో పేరు తెచ్చుకుంది. సృష్టికి మూలమైన పరబ్రహ్మ గురించి మాట్లాడింది. యాజ్ఞవల్క్యుని ముప్పుతిప్పలు పెట్టింది.
పురుషులకు స్త్రీలు ఎందులోనూ తీసిపోరని ఋజువు చేసింది. ఆది శంకరాచార్యులనూ ఇలాగే ఓ వనిత ఓడించింది. గార్గి కథ బృహదారణ్యక ఉపనిషత్తులో ఉంది. పూర్వం వాచక్ను అనే ఓ మహర్షి ఉండేవాడు. ఆయన కుమార్తె గార్గి అందానికీ, ఆత్మ స్థైర్యానికీ, పాండిత్యానికీ పెట్టింది పేరుగా ఉండేది. గార్గిని వాచక్ను మహర్షి గొప్ప పండితురాలిగా తీర్చిదిద్దాలనుకున్నాడు. తన ఆశ్రమానికి వచ్చే ఎందరెందరో పండితులతో ఆమెకు కావలసిన విద్యనంతటినీ నేర్చుకొనేలా చేశాడు. వేదాంత విద్యలో ఆమెను గొప్పగా తీర్చిదిద్దాడు. గార్గి విద్యా ప్రాభవం మెల్లమెల్లగా అందరికీ తెలిసింది. ఎక్కడన్నా గొప్ప గొప్ప వేదాంత సభలు జరిగినప్పుడుకూడా ఆమె వెళుతూ ఉండేది.
ఓ రోజున జనక మహారాజు ఓ గొప్ప సభ చేశాడు. ఆ సభకు ఎందరెందరో ప్రముఖులు వచ్చి వేదాంత చర్చలు జరిపారు. అదే సభకు గార్గి కూడా వెళ్ళింది. ఆ సభలో జనక మహారాజుకు ఓ ఆలోచన వచ్చింది. అంతమంది వేదాంత వేత్తల్లో బ్రహ్మవేత్త ఎవరో తెలుసుకోవాలనుకున్నారు. అలా బ్రహ్మవేత్త అయిన వ్యక్తికి బంగారు ఆభరణాలతో అలంకరించిన చక్కటి వేయి గోవులను బహూకరిస్తానని కూడా ప్రకటించాడు జనకుడు. ఆ ప్రకటన విని యాజ్ఞవల్క్య మహర్షి తానే బ్రహ్మవేత్తనని, ఆ గోవులను తనకే ఇమ్మని అన్నాడు. ఆ సభలో ఉన్న అశ్వలుడులాంటి రుషులు యాజ్ఞవల్క్యుడిని నీవు ఎలా బ్రహ్మవేత్తవో వివరించి చెప్పు అని అన్నారు. కానీ యాజ్ఞవల్క్యుడి ముందు ఎక్కువ సేపు నిలబడలేక పోయారు. అంతలో గార్గి లేచి ధైర్యంగా ప్రశ్నల వర్షం కురిపించింది. ఈ ప్రశ్నలడిగిన తీరు ఆమె వేదాంత పటిమకు గీటురాళ్ళయ్యాయి. దాంతో ఆ రోజు నుంచి గార్గి గొప్పతనం మరింతగా అందరికీ తెలిసింది.
గార్గి తన కడుపున పుట్టి అంత గొప్పదైనందుకు వాచక్ను మహర్షికి ఎంతో ఆనందం కలిగింది. అయితే ఆమె యవ్వన దశను దాటిపోతున్నా వివాహానికి మాత్రం సుముఖంగా లేకపోవటంతో ఎంతో బాధపడ్డాడు. తన కుమార్తె గొప్ప విద్యావతి అని పేరు తెచ్చుకోవాలనుకున్నాడు కానీ, పెళ్ళి లేకుండా బ్రహ్మచారిణిగా ఉండిపోవాలని అనుకోలేదు.
అలాంటి రోజుల్లో ఓ రోజున నారద మహర్షి ఆమె దగ్గర కొచ్చి స్త్రీ వివాహమాడాల్సిన అవసరాన్ని గురించి వివరించి చెప్పాడు. వివాహమైతే తప్ప ఆమె కావాలనుకుంటున్న ముక్తి సాధించటానికి అర్హత లభించదన్నాడు. అప్పుడు ఆలోచనలో పడింది గార్గి. తగిన వరుడి కోసం అన్వేషిస్తుంటే శృంగవంతుడు అనే ఒక ముని కనిపించాడు. అతడిని తనకు తగిన వరుడిగా భావించిన గార్గి వివాహానికైతే సమ్మతించింది కానీ, ఒక్క రోజుకు మించి తమ గృహస్థ జీవితం ఉండబోదని, రెండో రోజున సన్యాస దీక్షను తీసుకుని వెళ్లిపోతానని అంది. ఆమె అలా అనటం చూసిన కొందరు పెళ్ళి అయ్యాక ఈ ఆలోచన మానుకుంటుందిలే అనుకొన్నారు. పెళ్ళి అయింది. ఒక రోజు గడిచింది. ముందుగా అనుకొన్న మాట ప్రకారం తాను విడిపోబోతున్నానని గ్రహించి ఆమెకు నచ్చజెప్పటానికి ప్రయత్నం చేశాడు శృంగవంతుడు. కానీ ఆమె మనస్సు మార్చుకోలేదు. ఇహలోక సుఖాల కోసం పాకులాడక, ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోక తాను పొందాలనుకున్న ముక్తిమార్గం వైపు నడిచింది. వేదాంతసారం తెలిసిన మహోన్నత మనిషిగా చరిత్రలో నిలిచిపోయింది.
No comments:
Post a Comment