శ్రీమద్రామాయణం లోని కథ
పరమాత్ముడైన శ్రీ రామ చంద్రుడు అమిత పరాక్రమశాలి మహావీరుడు ధనుర్విద్యానిపుణుడు. శ్రీ రాముడు బ్రహ్మర్షి అగు వసిష్ఠ మహర్షి వద్ద సకల శాస్త్రములు ధనుర్విద్య అభ్యసించినాడు. గాయత్రీ మంత్రద్రష్ట అగు విశ్వామిత్ర బ్రహ్మర్షి వద్ద బల అతిబలాది విద్యలు మఱియు ఎన్నెన్నో అతి రహస్యములైన అస్త్రములను నేర్చినాడు. ఈ అస్త్రములు కేవలము విశ్వామిత్రులవారికే తెలియును. ఇదియే కాక పరమపూజనీయుడగు అగస్త్య మహర్షి శ్రీ రామ చంద్రునకు దివ్య ధనువు అక్షయ తూణీరము రత్నఖచిత ఖడ్గమును ప్రసాదించెను.
ఒక్క బాణముతో శ్రీ రామ చంద్ర మూర్తి మహాబలశాలియైన తాటకను నేలకూల్చెను
ఒకేమాఱు రెండు బాణములు వదిలి సుబాహు సంహారము చేసి మారీచుని సప్తసముద్రాలకు అవతల పారవేశను
మహాభారవంతమైన శివచాపమును అవలీలగా ఎత్తి ఎక్కుపెట్టిన అది విరిగెను
శ్రీ రాముడొక్కడే ప్రహరార్ధకాలములో (90 min.) ఖర త్రిశిర దూషణాదులను వారి సేనలను సంహరించెను
ఇంత ప్రతాపవంతుడైనప్పటికీ శ్రీ రాముడు ఎప్పుడూ తనకుతానుగా బలప్రదర్శనము చేయలేదు. ఆ దయార్ద్ర హృదయుడు సర్వదా వినయవంతుడై వర్తించెను. దీనికి తార్కాణము సముద్రుని గర్వభంగ ఘట్టము.
శ్రీ రాముని సైన్యము సముద్ర లాంఘనము చేయుసమయము వచ్చెను. సర్వజ్ఞుడైన రాముడు ఉపాయము ఎఱిగియు సహజ వినయవంతుడగుటచే పరమభాగవతోత్తముడైన విభీషణుని సలహా అడిగెను. విభీషణుడు ఇట్లు పల్కెను “ఓ రఘునాయకా! మీ బాణమొక్కటే కోటి సముద్రములనైనను శుష్కింప చేయగలదు. ఐనను సముద్రునే ఉపాయమడుగ ఉత్తమమని నా యోచన”.
రావణుడు తనను వివాహమాడమని హెచ్చరించి సీతమ్మవారికి నెల రోజుల గడువు ఇచ్చెను. భరతుడు పదునాలుగేండ్లపై ఒక్క నిమిషము కూడా శ్రీ రామునికి దూరంగా ఉండజాలక శ్రీ రాముడు ఆలస్యమైన పక్షంలో శరీరత్యాగం చేసెదనని ప్రతిజ్ఞబూనెను. ఈ రెండు కారణముల వలన శ్రీ రాముని వద్ద అప్పటికి పట్టుమని ౩౦ రోజులుకూడాలేవు. ఐనను రఘురాముడు తన బలప్రదర్శనము చేయక వినయముతో సాగరుని ప్రార్థింప నిశ్చయించెను.
శ్రీ రాముడు ఉదధిని సమీపించి సముద్రునకు శిరసా ప్రణమిల్లెను. పిదప తీరమున దర్భలు పరచి ఆ దర్భాసనం పైన కూర్చుని తదేక దృష్టితో సముద్రుని ప్రార్థించెను. ఇట్లు ౩ దివసములు సముద్రునికై ప్రార్థించినను ఆ సముద్రుడు రాడాయె. చివరకు శ్రీ రాముడు “ఈతనికి సామముగా చెప్పిన వినడాయె. ఇటువంటి వారికి దండోపాయయే సరియైనది” అని సముద్రునిపై అస్త్రం సంధించెను. శ్రీ హరి కోపమును భరింపగలవారెవ్వరు? వెంటనే సముద్రుడు ప్రత్యక్షమయ్యెను. అంత దయాళువైన శ్రీ రాముడు సముద్రుని క్షమించి తాను ఎక్కుపెట్టిన అమోఘ బాణము దేనిమీద ప్రయోగింపవలెనని అడిగెను. సముద్రుడు ఉత్తరాన దుష్టులైన కాలకేయ రాక్షసులు ఉన్నారని సూచించెను. అంతట శ్రీ రాముడు ఆ అస్త్రముతో ఆ రాక్షసుల సంహారముచేసి ఆ కాలకేయులుండే పర్వతం ఔషధాలకు నిలయమై ప్రజాహితం చేకూర్చునని ఆశీర్వదించెను.
No comments:
Post a Comment