Sunday, June 28, 2020

చెరువును ఎలా నిర్మించాలో చెప్పిన పోరుమామిళ్ళ శాసనం.

చెరువును త్రవ్వించడం ఓ పుణ్యకార్యంగా మనపూర్వీకులు భావించారు. పుణ్యకార్యమేకాదు అదో ప్రజాహిత కార్యక్రమం. అందుకే దక్షిణాపథంలో మనరాజులు చక్రవర్తులు సామంతులు దండనాయకులు చివరకు సామాన్యుడు కూడా చెరువులను నిర్మించి తమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేశారు.

ఈనాడైతే మనవద్ద ఆధునిక శాస్త్రపరిజ్ఞానం అత్యంత సాంకేతిక పనిముట్లు యంత్రాలున్నాయి.కనుక జలాశయ నిర్మాణాలు సులభంగా చేపట్టగలుగుతున్నాము.

ఇప్పటికి 2300 సంవత్సరాల క్రిందటనే మనవారు ఉత్తమోత్తమ పరిజ్ఞానంతో చెరువులు నిర్మించారు.ఉదాll సుదర్శన తటాకాన్ని మౌర్యబిందుసారుడి కాలంలో పుష్యగుప్తుడు అనేవాడు గుజరాతులో నిర్మించాడు. ఈ తటాకం తెగిపోతే  శకరాజు రుద్రదమనుడు మరమ్మత్తు చేసాడు. ఈ తటాకగొప్పతనాన్ని జునాఘడ్ శాసనంలో రుద్రదమణుడు పెర్కొన్నాడు.

అలాగే ఇప్పటికి 1800 సం|| క్రిందట కరికాలచోళుడు కావేరినదిపై నిర్మించిన కల్లాడై / కల్లానై ఆనకట్ట ఈనాటికి చెక్కుచెదరలేదు. సింధు నాగరికతలోని నీటిపారుదల వ్యవస్థ మనకు తెలిసిందే.

భాస్కరభావదుర అనే యువరాజు విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన ఒకటవ హరిహరరాయలకుగల ఐదుమంది సంతానంలో ఒక్కడు. నెల్లూరుజిల్లాలోని ఉదయగిరిని కేంద్రంగా ఓ రాష్ట్రాన్ని పాలించేవాడు.

ఇతను శాలివాహనశకం 1291 లో అనగా 1369లో కడపజిల్లా పోరుమామిళ్ళలో చెరువును త్రవ్వించి చెరువు నిర్మాణం ఎలా వుండాలో అక్కడే ఓ శాసనం చెక్కించాడు. మంచి తటాకాన్ని నిర్మించాలంటే పన్నెండు అంగాలు సాధనాలు వుండాలి. అవి

(1)  చెరువును నిర్మించే వ్యక్తి సంపన్నుడు, ఆనందితుడు సచ్ఛీలుడైవుండాలి.

(2) పాత:శాస్త్ర ప్రవీణులుండాలి. పాత: శాస్త్రమంటే చెరువును త్రవ్వే కళ.

(3) చెరువు నిర్మాణానికి కఠినమైన, దృఢమైన నేలను ఎన్నుకోవాలి.

(4) మూడుయోజనాల దూరం లోపల చెరువుకు నీటిని అందించే  వాగులు వంకలు కాలువలు నదులు ఉండాలి.

(5) చెరువుకట్టకు అటువైపు ఇటువైపు కొండగుట్టలుండాలి.

(6)  చెరువుకట్ట కట్టడాన్ని మరి పొడుగుగా కట్టరాదు. (అలా కట్టవలసిన పరిస్థితులు ఎదురై మధ్యలో కూడా ఒక మరవను (అలుగు) ను ఏర్పాటుచేయాలి)

(7) అటువైపు ఇటువైపున్న కొండగుట్టలు మెత్తగా మృదువుగా ఉండక దృఢంగా ఉండాలి.

(8) చెరువుగర్భం (మధ్యభాగం) లోతుగా వుండెట్టుగా చూచుకోవాలి.

(9) చెరువు నిర్మాణానికి  కఠినమైన రాళ్ళు ఉపయోగించాలి.

(10) చెరువుతూములనుండి పారే నీరు పల్లపు ప్రదేశానికి వెళ్ళేవిధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. పంటలకు అనువైన సారవంతమైన నేలలు ఉండాలి.

(11) చెరువులో బలమైన అలలు సుడులు వగైరాలు వస్తే వాటిని కొండగుట్టలు అడ్డుకొనేలా ఉండాలి.

(12) తటాకనిర్మాణానికి సిద్ధహస్తులు నిపుణులైన పని వారు పనిముట్లు ఉండాలి.

చెరువు నిర్మాణానికి  అనువుకాని పరిస్థితులను కూడా పోరుమామిళ్ళ శాసనం పెర్కొంది.

(1) చెరువుకట్ట నుండి నీరు ఊరరాదు, ఉబకరాదు.

(2) చౌడు, ఉప్పునీటి నేలలు చెరువు నిర్మాణానికి పనికిరావు.

(3) రెండు రాజ్యాల మధ్య తటస్థంగా వున్నచోటు చెరువు నిర్మాణానికి పనికిరాదు.(ఎందుకంటే జలకలహాలు వస్తాయి. యుద్ధసమయంలో చెరువునీటిని విషపూరితం చేస్తారు.)

(4) చెరువుమధ్య భాగం ఉబ్బుగా (మెరక / ఎత్తు ) ఉండరాదు.

(5) సాగుభూమి చెరువులోని నీటిపరిమాణం ప్రకారమే సరిగా వుండాలి. చెరువు నీరు తక్కువగా వుండి సాగునేల ఎక్కువగా వుండరాదు.

(6) చెరువులో నీరు పుష్కలంగా ఉండి సాగుభూమి తక్కువగా వుండరాదు.

ఈ సూత్రాలు అప్పటికేకాక ఇప్పటికి కూడా అనుసరణీయమే.

ప్రశ్నలు...

(1) మనదేశంలో చెరువులు  అధికంగావున్న రాష్ట్రమేది ?

(2) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోగల పెద్దచెరువు ఏది ?

No comments:

Post a Comment