Tuesday, June 23, 2020

నామస్మరణం

నవవిధ భక్తిమార్గాల్లో స్మరణం చాలా ముఖ్యమైనది. పరమాత్మతో ఆత్మానుసంధానానికి, భక్తికి నామస్మరణమే కీలకమైనది. దైవ నామస్మరణ వల్ల భక్తుడి హృదయంలో భక్తిభావన వెల్లివిరుస్తుంది. మనసు ప్రశాంతంగా ఉండాలన్నా, నిర్మలత్వం సంతరించుకోవాలన్నా భగవంతుణ్ని స్మరించాలని పురాణాలు చెబుతున్నాయి.

ఈ భారతావనిలో ఎందరెందరో భక్తులు భగవంతుణ్ని స్మరిస్తూ తమ కర్తవ్యాన్ని నిష్ఠతో చేసి జన్మను సార్థకం చేసుకున్నారు.

రామనామం జపిస్తూ హనుమంతుడు సముద్రాన్ని ఆకాశమార్గంలో దాటి లంకానగరం చేరాడు. హరినామ సంకీర్తన చేసిన ప్రహ్లాదుణ్ని ఎన్ని బాధలు పెట్టినా ఏ విధమైన హానీ జరగలేదు. కృష్ణనామస్మరణం చేసిన మీరాబాయికి విషం        అమృతతుల్యమైంది.

ఎంత చెడ్డవాడైనా, అనన్యమనస్కుడైనా తనను ఆరాధించి సేవిస్తే వాణ్ని సజ్జనుడిగానే పరిగణించాలని బోధించాడు శ్రీకృష్ణపరమాత్మ.

ఉత్తమకులంలో పుట్టి, చెడిపోయిన అజామీళుడు ప్రాణావసాన సమయంలో ‘నారాయణ’ పేరును స్మరించినంతనే మోక్షప్రాప్తి కలిగిందంటుంది భాగవతం.

దైవనామ స్మరణ మనిషిలోని మాలిన్యాన్ని క్షాళన చేసి ధర్మమార్గం వైపు నడిపిస్తుంది. సర్వశక్తిమంతుడు, సర్వాధీశుడు అయిన భగవంతుడి నామస్మరణ వల్ల ‘నేను’ అనే అహంకార గోడ అడ్డు తొలగిపోతుంది. మనసు భగవంతుడి పాదపద్మాలపై నిలుస్తుంది.

కర్తవ్యాన్ని నిష్ఠతో ఆచరిస్తూ ప్రాతఃకాలం, సాయంకాలాల్లో ఒక్కసారి భగవత్‌ స్మరణ చెయ్యడం కూడా గొప్పతనమేనని వివరించే కథ ఉంది.

ఒకరోజు నారదుడు వైకుంఠంలో శ్రీమహావిష్ణువు సన్నిధిలో ఉన్నాడు. తనకంటే గొప్ప భక్తుడెవరూ లేరనే అహంకారం నారదుడికి కలిగింది. తానెప్పుడూ నారాయణ నామస్మరణ చేస్తాడు కనుక తానే ఉత్తమ భక్తుడు అనుకున్నాడు. ఆ భావాన్ని మహావిష్ణువు ముందు వ్యక్తీకరించాడు. నీకంటే గొప్పభక్తుడు ఫలానా గ్రామంలో ఉన్నాడు. నువ్వు అక్కడికి వెళ్ళు అని నారదుడిని పంపాడు విష్ణుమూర్తి. నారదుడు ఆ గ్రామం వెళ్ళి ఆ భక్తుణ్ని చూశాడు. అక్కడ ఒక రైతు తెల్లవారుజామున లేవగానే ‘నారాయణ’ అనుకుని తన పనుల్లో నిమగ్నమయ్యాడు. తిరిగి రాత్రి ‘నారాయణ’ అనుకుని పడుకున్నాడు. రోజుకు రెండుసార్లు మాత్రమే నారాయణ స్మరణ చేస్తున్న ఇతడు గొప్ప భక్తుడా అనుకుని, నారదుడు తాను చూసినది చూసినట్లుగా మహావిష్ణువుకు చెప్పాడు.


అప్పుడు మహావిష్ణువు నారదుణ్ని పరీక్షించదలచి ‘నీకు ఒక నూనెగిన్నె ఇస్తాను. అది పట్టుకుని ఒక్కబొట్టు కిందపడకుండా వైకుంఠం అంతా తిరిగిరావాలి’ అన్నాడు. నారదుడు ఆ గిన్నె తీసుకుని వైకుంఠం అంతా తిరిగి మహావిష్ణువు దగ్గరికి తిరిగివచ్చాడు. ‘నారదా! నువ్వు ఎన్నిసార్లు భగవన్నామం స్మరించావు?’ అని అడిగాడు విష్ణువు. దానికి జవాబిస్తూ నారదుడు ‘గిన్నెలో నుంచి నూనె బొట్టు కిందపడకుండా చూస్తున్నాను. మీ నామాన్ని ఒక్కసారి కూడా స్మరించలేదు’ అన్నాడు. అప్పుడు  నిజమైన భక్తుడెవరో గ్రహించాడు నారదుడు.

భగవంతుడి నామస్మరణ ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అనే సందేహాలు చాలామందిలో కలుగుతుంటాయి. భగవంతుణ్ని స్మరించడానికి ఎలాంటి నియమాలు లేవు. సర్వకాల, సర్వావస్థల్లోనూ స్మరించుకోవచ్చు. మన పనులు నిత్యం చేస్తూనే శుద్ధ భక్తితో భగవంతుణ్ని స్మరించాలి.

అసలు స్మరణ ఎందుకు చేయాలంటే భగవదనుగ్రహం కోసమే. వార్థక్యంలో మాత్రమే భగవంతుణ్ని స్మరించుకుందాం అనుకోకూడదు. దైవచింతనకు వయసుతో నిమిత్తం లేదు.

No comments:

Post a Comment