Saturday, June 27, 2020

రాజ ధర్మం-భక్తి ధర్మం

ధర్మం నాలుగు పాదాలుగా నడిచిన త్రేతాయుగంలోని రామాయణకాలంలో రాజధర్మానికి, భక్తిధర్మానికి మధ్య జరిగిన సంఘర్షణ, వాటివల్ల పొడసూపిన భావవైరుధ్యాన్ని వారు ఆనుభవించిన తీరు చాలా ఆశ్చర్యం కలిగించేలా ఉండి, సగటు మనిషికి ఎన్నో జీవితపాఠాలు నేర్చుకునే అవకాశం కలిగిస్తుంది. పరిస్థితులు ధర్మసంకటాన్ని సృష్టించినా, తాము నమ్మిన సిద్ధాంతాల కోసం తమ జీవితాలను సమర్పించి పునీతం చేసుకున్న రెండు వైవిధ్యమైన వ్యక్తిత్వాల మధ్య ఉన్న అపురూపమైన అనుబంధాన్ని వాల్మీకి మలిచిన తీరు మనం రామలక్ష్మణుల వృత్తాంతాలను అవలోకిస్తే అవగతమవుతుంది.

మర్యాదా పురుషోత్తముడిగా మన్ననలందిన శ్రీరాముడి ధర్మజిజ్ఞాస రామాయణమంతా మనకు అగుపడుతుంది. అందుకే ‘రామో విగ్రహవాన్‌ ధర్మః’ అని శత్రువైన మారీచుడి ద్వారా వర్ణితమైన ఉత్తమోత్తముడు శ్రీరాముడు. అడుగడుగు నా ఎన్ని పరీక్షలు ఎదురైనా కేవలం తండ్రికిచ్చిన మాట కోసం స్వంతవారి ని, ప్రజలను ఐశ్వర్యాన్ని రాజ్యాధికారాన్ని తృణప్రాయంగా వదిలి అడవిబాట బట్టిన త్యాగశీలి. కైకేయి వరం వల్ల దశరథుడు తాను తలపెట్టిన పట్టాభిషేకానికి బదులు ఉన్నఫలాన రాజ్యాన్ని భరతుడికి వదిలేసి వెళ్ళమని అన్నప్పుడు, ఒక్కమాట కూడా ఎదురుచెప్పకుండా, తల్లి కౌసల్య వద్దని వారిస్తున్నా, అన్యాయం జరుగుతుందని లక్ష్మణుడు వారిస్తున్నా, ఎన్నో కష్టాలు అనుభవించి,  ఆ ప్రస్థానంలో, ఏకపత్నీ వ్రతాన్ని, సుగ్రీవుడి విషయంలో స్నేహధర్మాన్ని, విభీషణుడి విషయంలో రాజధర్మాన్ని, భరతుడు తన పాదుకలు స్వీకరించడానికి వచ్చినపుడు రాజ్యపాలనా రహస్యాలను వివరించి తన భాతృధర్మాన్ని నిర్వర్తించిన సౌహార్ద్ర శీలి ఆ పురుషోత్తముడు.

అటువంటి రాముడి అత్యంత ప్రియమైన సోదరుడు, అరివీర భయంకరుడు, పేరుకి సవతి తమ్ముడైనా, రాముడి కోసం ప్రాణత్యాగం కూడా చేయడానికి వెనుకాడని భక్తిధర్మం లక్ష్మణుడిది. ఇద్దరి మనస్తత్వంలో ఎంతో వైరుధ్యం ఉంది. తాను స్వతహాగా రాముడికి ధీటైన వాడైనా, అన్నమాట దాటని సేవకుడు. లక్ష్మణుడు, రాముడికి ఏ కష్టం వచ్చినా తట్టుకోలేడు. ఎంతటి సాహసానికైనా వెనుకాడడు. తన దృష్టిలో రాముడికి కష్టం కలిగించిన వారెవరూ తన మిత్రులు కారు. రాముణ్ణి బాధపెట్టే అవకాశం ఉన్న ఏ సంఘటనా ఆయనకు రుచించదు. లక్ష్మణుడు నమ్మిన ఏకైక ధర్మం రామభక్తి. మిగతా అన్నీ అధర్మాలే. ఎంతటి ఆవేశాన్నయినా ఒక్క రాముడి కంటిచూపుతోనే తగ్గించుకొని, రామసేవలో నిద్రాహారాలు మాని, తన సర్వసుఖాలు వదులుకొని ఒక సేవకుడిగా మారి, తన భక్తిని చాటుకున్న ధర్మశీలి లక్ష్మణుడు.

రాముడిని నిత్యం అనుసరిస్తూ గడిపిన లక్ష్మణుడి దృష్టిలో, రాముడిని వనవాసానికి వెళ్ళమన్న తండ్రి దశరథుడు, కైకేయి ఇద్దరూ పెద్ద మోసగాళ్ళు. వారి నిర్ణయంపై ఆగ్రహంతో, వారిని, అయోధ్యనంతటినీ నాశనం చేయడానికి కూడా ఉద్యుక్తుడైన సాహసవంతుడు, నిరంతరం తన ఆవేశాన్ని సీతారాముల సేవలో అణిచివేసుకొని, కేవలం అన్న వెంటే ఉండాలన్న భక్తితో, తన సతీ వియోగంలో పధ్నాలుగేండ్లు వనవాసంలో గడిపిన ధర్మమూర్తి. లక్ష్మణుడికి రాముడి మాటంటే ఎంత గురి అంటే, రాముడి ధర్మవాక్కులు ఎక్కడైనా నచ్చినా, నచ్చకపోయినా ఒక్కమాట కూడా అనక భాతృప్రేమను చాటిన ఉత్తముడు సౌమిత్రుడు. లక్ష్మణుడి తల్లి సుమిత్ర ఎంతో ఉత్తమురాలు. తన సవతి కొడుకుతో పాటు భార్యను, రాజ్యాన్ని వదిలి వనవాసానికి సిద్ధమైన పుత్రుడిని వారించకుండా, పైగా ‘రాముని క్షేమం పూర్తిగా నీ బాధ్యతయే’ అన్నదిగానీ, ‘నువు జాగ్రత్త’ అనలేదు. అంతటి ఉత్తమోత్తమమైన తల్లికి పుత్రుడు. కాబట్టే, లక్ష్మణుడు (సౌమిత్రుడు) అంతటి సౌశీల్యుడయ్యాడు. చివరకు యుద్ధంలో ఇంద్రజిత్తు ఏ అస్ర్తానికీ లొంగకపోతే రాముడిని, రాముడు పాటించిన ధర్మాన్ని మనసులో తలుచుకొని బాణం వేసి వధించి, రాముడి రాజధర్మాన్నీ, తన భక్తిధర్మాన్ని ఒకేసారి నిరూపించిన సౌజన్యశీలి లక్ష్మణుడు.

మనస్తత్వంలో ఇంతటి వైరుధ్యం ఉన్నా, తాను నమ్మిన రాజధర్మం కోసం రాముడు, తాను నమ్మిన భక్తి కోసం అన్నను తప్ప అన్నీ త్యాగం చేసిన తమ్ముడు లక్ష్మణుడు. అటువంటి రామలక్ష్మణ అనుబంధం అజరామరం. మనందరికీ ఆదర్శప్రాయం, ఆచరణీయం. ఇప్పుడు అరుదైనా, మన ఉమ్మడి కుటుంబాల్లో ఇటువంటి అనుబంధాలను ఇంకా మనం చూడవచ్చు. దీనికి ఇంకా ఆస్కారం ఉంది కూడా. ధర్మో రక్షతి రక్షితః

No comments:

Post a Comment