Sunday, June 28, 2020

శ్రీమన్నారాయణ వృత్తాంతము - 5

🌻. తమ భక్తులను రక్షించు నాగులను చంపుటకు ప్రయత్నించిన వారికి శ్రీపాదుల వారి గుణపాఠము.

నాగులచవితినాడు మా గ్రామమునకు మంత్రగాడు ఒకడు వచ్చియుండెను. 

ఆ మంత్రగానిని మా దాయాదులునూ, గ్రామపెద్దయు సాదరముగా ఆహ్వానించిరి. అతడు ఎంతటి విషసర్పమునయిననూ తన మంత్రశక్తితో స్తంభింపజేసి వశమొనరించుకోగలగినవాడు. పాము కరచిన ఏ వ్యక్తిని అయినా తన మంత్రశక్తితో జీవింపజేయగలగినవాడు. అతనిచేతిలో గరుడరేఖ కూడా యుండెను. 

గరుడరేఖ కలిగిన మానవులకు సర్పములు స్వాధీనములగునని శాస్త్రవచనము. ఆ సర్పములను హతమార్చవలెనని గ్రామపెద్దయు, మంత్రగాడును తలపోయుచుండిరి.

పుట్టకు దరిదాపులలోనున్న ప్రాంతమంతయునూ మంటలు ఏర్పాటు చేయబడెను. మంత్రగాడు తన ఆసనమునందు కూర్చొని వింత వింత పద్ధతులతో తంత్రములనుచేయుచూ మంత్రములను బిగ్గరగా చదువుచుండెను. 

జాతి సర్పములను వధింపబూనుట పాపహేతువని మేము బాధపడుచుంటిమి. మేము నిస్సహాయస్థితిలో నుంటిమి. అమాయకములయిన జాతిసర్పములను ఆ శ్రీపాదుల వారే రక్షింపవలెనని ప్రార్థించుచుంటిమి. 

మంత్రశక్తికి లోబడినవో అనునట్లు ఆ సర్పములు పుట్టనుండి బయటకు వచ్చినవి. మంత్రగానికిని, వాని అనుచరులకునూ యిదిఎంతయో సంతసము కూర్చుచుండెను. అయిననూ వారికి ఆ సంతసము ఎక్కువసేపు నిలువలేదు. 

బయటకు వచ్చిన సర్పములు క్షణక్షణమునూ ఆకారములో పెద్దవగుచుండెను. మంత్రగాడు బిగ్గరగా మంత్రములు చదువుచుండెను. మంత్రశక్తికి లోబడినవో అన్నట్లు ఆ సర్పములు అగ్నికీలలవైపు పయనించుచుండెను. 

ఆశ్చర్యము! అగ్నిదేవుడు వాటికి దారి విడిచెనో అన్నట్లు అవి వచ్చు మార్గము నందు మాత్రము అగ్ని చల్లారుచుండెను.తుదకు అగ్ని అంతయునూ ఆరిపోయెను. ఆ సర్పరాజములు యధేచ్చగా అచ్చటనుండి వెడలిపోయెను. మంత్రగాడును, అతని అనుచరులునూ బిత్తరపోయిరి.

ఇంతలో గ్రామపెద్ద పెద్దకుమారునికి పాము కరచిన వానికుండు లక్షణములు కన్పింపసాగెను. రెండవ కుమారుని నేత్రములకు చూపు బాగుగా తగ్గిపోయెను. 

పాము కరవకుండగనే సర్పదష్టునకుండు లక్షణములు ప్రాప్తించి శరీరము విషపూరిత  మగుట విడ్డూరము. ఉన్నట్టుండి అంధత్వము ప్రాప్తించుటయూ విడ్డూరమే! మంత్రగాడు మంత్రములనెన్నింటినో పఠించెను. కాని ఫలితము లభింపలేదు. 

అతని చేతిలోని గరుడరేఖ క్రమక్రమముగా తన ఆకారమును కోల్పోయి పూర్తిగా అదృశ్యమాయెను. గ్రామపెద్ద మనసులో మహాభయము తోచెను. అనాధ రక్షకుడగు శ్రీపాదుడు తప్ప వేరేవ్వరునూ దిక్కులేరు. మంత్రగానిలో మంత్రశక్తి పూర్తిగా క్షీణించెను. కొద్ది నిముషములలో అతడు విగతజీవుడాయెను. 

శ్రీపాదుల వారి లీల ఏ సమయములో ఎట్లుండునో ఎవరికెరుక? గ్రామపెద్ద మా వద్దకు పరుగెత్తుకొని వచ్చి గోలుగోలున ఏడువసాగెను. మేము మాత్రము ఏమి చేయగలము? అనన్యచింతతో శ్రీపాదుల వారిని స్మరించిన యెడల నీ యిద్దరు కుమారులును స్వస్థత పొందగలరని మాత్రము చెప్పితిమి.

మాంత్రికుని కళేబరము గ్రామపెద్ద యింటివద్ద నుండెను. గ్రామపెద్ద కుమారులు యిద్దరునూ విధి వైపరీత్యమునకు లోనయిరి. మా దాయాదులు భయముతో వణకిపోసాగిరి. వాతావరణమంతయునూ విషాద భరితముగా నుండెను. 

చనిపోయిన మాంత్రికుని శవమును స్మశానమునకు  తీసుకొనిపోయిరి. కట్టెలు పేర్చబడి చితికి నిప్పంటించబడెను. నిప్పంటించిన శవాములో ఆకస్మాత్తుగా చైతన్యము కలిగెను. శవము తనను అగ్నిబాధ నుండి రక్షించమని కేకలు వేయుచుండెను. 

కాటికాపరివాండ్రు  చనిపోయిన మాంత్రికుడు దయ్యమై తిరిగి శరీరములో ప్రవేశించినాడనియు, వానిని రక్షించినచో యిదే శరీరముతో అతడు ప్రేతార్మ చేయు దుష్ట కార్యములన్నియునూ చేయుననియూ, అతని శవము కాలి బూడిద అయిన యెడల కేవలం ప్రేతాత్మ గానే యుండి తనకి వశమైయుండెడి వారి దేహములందు ప్రవేశించి కొంతమందిని బాధించుననియూ, అందుచేత శవమునకు నీళ్లుపోయు ప్రయత్నమును మానుకొనిరి. 

విగతజీవుడై ఉపాధిరహితుడుగా నున్న ప్రేతాత్మకంటే సజీవుడై తన స్వంత ఉపాదిలోనే ప్రవేశించెడి ప్రేతాత్మ ఎక్కువ శక్తులని కలిగియుండి సమాజమునకు విశేష వినాశనమును, దుఃఖములను కలిగించి తీరుననియు వారు తలపోసిరి. 

ప్రారబ్ధానుసారముగా ఆయా వ్యక్తుల మానసములందు ఆయా భావములను కలిగించి ఆయా కర్మఫలములను అనుభవింపజేసి ప్రత్యక్షముగా తన అవతారతత్త్వము యొక్క నిజస్వరూపమును బోధపరచుట శ్రీపాద శ్రీవల్లభుల వారి విచిత్ర విధానము. 

No comments:

Post a Comment