త్రిపురాలు..మనిషిని మింగేస్తున్నా మూడు వికారాలు-నేను,నాది,నాదికానిది.
'నేను' అంటే -నా శరీరం,నా మనసు.
'నాది' అంటే-నా ఆస్తి, నా జ్ఞానం, నా కుటుంబం, నా అధికారం.
'నాది కాదు'అంటే-నాకు అందనిది,అందుబాటులో లేనిది,నేను అందుకోవాలని ఆరాట పడుతున్నది...ఏదయినా కావచ్చు..
'నాది' అనుకోవడములో బాధ ఉంది.'నాది కాదే'!అనుకోవడములోను బాధ ఉంది.మొత్తంగా 'నా...'అనే ఆలోచనే వద్దు అంటుంది "నీ తత్వము"..ఈ మూడు దుఃఖ కారకాలే..ఆ త్రివిధ వికారాలకి ప్రతీకలైన ముగ్గురు రాక్షసులు మూడు ఎగిరే నగరాలని సృష్టించుకొని ముల్లోకాలని అల్లకల్లోలం చేస్తుంటారు.
ఆ మూడు నగరాలని ఒకే బాణంతో నేలకూల్చాలి. లేదనంటే లేదు.అది వారి ధైర్యము,వారికున్న వరము.ఒకే సరళరేఖలో ఎగురుతున్నప్పుడే దుష్టశిక్షణ సాధ్యమవుతుంది... త్రిపురాల్ని నాశనం చేయడమంటే...నేను,నాదీ, నాదికాదు అన్న భావనల్ని తొలగించుకోవడమంటే... ఎంత కష్టం!
మనలోని సమస్త శక్తుల్ని కూడగట్టుకోవాలి.నువ్వు చేసింది అదే కదా....
"భూమిని రథము చేసుకున్నావు,(భూమి వాస్తవిక దృక్పథానికి ప్రతీక)సూర్యచంద్రుల్ని చక్రాలుగా అమర్చకున్నావు(ఆ రెండు జీవితములో ఎత్తుపల్లాల్ని ప్రతిబింబిస్తాయి).బ్రహ్మ సారథ్యం వహించాడు(బ్రహ్మ జ్ఞానానికి మూలము)..మేరుపర్వతము వింటి చాపమైంది(కొండ ఆత్మబలానికి రూపము),శేషుడు వింటినారి అయ్యాడు,సర్పం శరము అయ్యింది.(సర్పాన్ని సంధించడమంటే కోరికల్ని జయించడము) పరిపూర్ణ ఆత్మవిశ్వాససముతో వెన్నంటి తరమగా..త్రిపురాలు ఒకే సరళరేఖ మీదకి వచ్చాయి.నీ బాణం దెబ్బకి కాలి బూడిద అయిపోయాయి.. నాలోను తిష్టవేసుకున్న త్రిపురాసుల్ని సంహారం చేసేటంతటి శక్తిని ప్రసాదించు ప్రభు....
No comments:
Post a Comment