Monday, April 13, 2020

పిల్లలపెంపకం విషయంలో రామాయణం ఏం చెపుతున్నది?


    శ్రీరాముడు సీతాదేవి నగలను లక్ష్మణుడికి చూపించి ఇవి మీ వొదిన కేయూరాలే గద !   ఒక్కసారి నువ్వు కూడా గురుతు పట్టు అంటే అప్పుడు లక్ష్మణస్వామి అంటారు కదా .......

 *నాహం జానామి కేయూరే   నాహం జానామి కుండలే*             
*నూపురే త్యభి జానామి నిత్యం పాదాభివందనాత్* 

           దీనర్థం ఏమిటంటే ఓ అన్నా! వొదినగారు భుజానికి పెట్టుకునే  కేయూరాలు గానీ గానీ, చెవులకు పెట్టుకునే కుండలాలు గాని నే నెరుగను, కానీ  ఆవిడ పాదాలకు పెట్టుకునే నూపురాలను మాత్రం గుర్తు పట్టగలను. ఎందుకంటే ఆ తల్లి పాదాలకు నిత్యం నమస్కారం చేస్తాను కాబట్టి .
పరస్త్రీని కన్నులెత్తి చూడని సంస్కారం! 
అసలు ఆడువారి ముఖంలో ముఖంపెట్టి కళ్ళలోకి సూటిగా చూస్తూ ఎందుకు మాట్లాడాలి ?
ఈ విధమైన శీల సంపద లక్ష్మణుడికి ఎక్కడ నుండి వచ్చింది ? తల్లి సుమిత్రాదేవి పెంపకం!! 

   రాముడితో అడవికి వెళ్ళేటప్పుడు ఆ మహాతల్లి కొడుకుకు ఏమని చెపుతుందో తెలుసా?

 *రామం దశరథం విధ్ధి,  మాం విధ్ధి జనకాత్మజాం,*
*అయోధ్యాం అటవీం విధ్ధి  గచ్ఛ తాత! యథా సుఖం*

 *రాముణ్ణి దశరథుడనుకో, సీతను నన్ననుకో*
*అడవిని అయోధ్య అనుకో   హాయిగా వెళ్ళిరా నాన్నా!*
   ఇంత సంస్కారమున్న తల్లి పెంచింది కాబట్టే,   లక్ష్మణుడు అంత శీలవంతుడయ్యాడు; చీర తొలగి మత్తులో ఉన్న తారతో మాట్లాడవలసి వచ్చి నప్పుడు తల వంచుకుని మాట్లాడిన అద్భుత శీల సౌందర్యం లక్ష్మణస్వామిది !

నేడు ప్రతి తల్లీ తెలుసుకో వలసిన సత్యం ఇది కాదా?
పిల్లలను ఈ విధంగా పెంచితే దేశంలో ఏ ఆడబిడ్డయినా ఎందుకు బాధపడుతుంది? 
నిర్భయ లాంటి ఘటనలు ఎందుకు చోటు చేసు కుంటాయి? ప్రియాంక రెడ్డి లాంటి భవిష్యత్తు ఉన్న బంగారుతల్లుల జీవితాలు ఎందుకు చిదిమి వేయబడతాయి ?

  రామాయణం, రామకథలు విరివిగా ప్రచారం చేయండి ! పరస్త్రీని ఇష్టం లేకుండా చెరబడితే దండన ఏదో, స్త్రీలతో ఎలా మెలగాలో అన్నీ తెలుస్తాయి.

రామరాజ్యంలో ఓ కుక్క కథ

రామరావణ యుద్ధం ముగిసింది. రాముడు పట్టాభిషిక్తుడు అయ్యాడు. ఆయన పాలనలో ధర్మం నాలుగు పాదాలా నడుస్తోందన్న కీర్తి ముల్లోకాలకీ వ్యాపించింది. అలాంటి సందర్భంలో ఓ రోజున...
రాముడు తన దర్బారులో కొలువై ఉన్నాడు. అతని చుట్టూ మంత్రులు పరివేష్టించి ఉన్నారు. కశ్యపుడు, వశిష్టుని వంటి రుషివర్యులు ఉచితాసనాలని అలంకరించారు. అలాంటి నిండుసభలో రాముల వారు లక్ష్మణుని వంక చూస్తూ ఎవరన్నా పౌరులు కార్యార్థులై, తన సభకు చేరుకున్నారా అని అడిగాడు. సుభిక్షమైన రాముని పాలనలో... ప్రత్యేకించి విన్నవించుకునేందుకు ఎవరికీ ఏ సమస్యా, అవసరమూ లేవని బదులిచ్చాడు లక్ష్మణుడు. పోనీ రాజద్వారం దగ్గర ఎవరన్నా సమస్యలతో నిలబడి ఉన్నారేమో చూసి రమ్మని పంపాడు రాముడు.  

రాముని ఆజ్ఞ మేరకు రాజద్వారాన్ని చేరుకున్న లక్ష్మణుడికి అక్కడ ఓ గాయపడిన కుక్క కనిపించింది. ‘ఓ శునకమా! నీకేం ఆపద వచ్చింది? ఎలాంటి సంకోచమూ లేకుండా నీకు వచ్చిన సమస్యని చెప్పుకో!’ అంటూ అభయమిచ్చాడు లక్ష్మణుడు. దానికి ఆ కుక్క తన సమస్యని రామునికే విన్నవించుకుంటానని పట్టుపట్టింది. దాంతో దానిని రాముని సమక్షానికి తోడుకుపోక తప్పలేదు లక్ష్మణునికి
 

తనకి వచ్చిన ఆపదని చెప్పుకోమంటూ రాముడు అభయాన్ని ఒసిగిన వెంటనే ఆ కుక్క – ‘ప్రభూ! రాజన్నవాడు తన పౌరులకి దేవునితో సమానం. వారికి సృష్టి, స్థితి, లయకారుడు ఆ రాజే! అందుకనే తన రాజ్యంలోని ధర్మాన్ని కాపాడవలసిన బాధ్యత రాజు మీదే ఉంటుంది. దానం, కరుణ, సత్పురుషులని ఆదరించడం, మంచి నడవడి వంటి లక్షణాలన్నీ కూడా ఆ ధర్మానికి ప్రతీకలుగా నిలుస్తున్నాయి. కానీ నీ రాజ్యంలో ఒకరు ధర్మాన్ని తప్పి నా మీద దాడి చేశారు. సర్వదసిద్ధుడనే పరివ్రాజకుడు నన్ను గాయపరిచాడు,’ అంటూ వాపోయింది.

ఆ శునకం మాటలు విన్న రాములవారు వెంటనే సర్వదసిద్ధుని పిలిపించారు. ‘ఆ కుక్కను గాయపరిచిన మాట నిజమే ప్రభూ! నేను యాచనకు బయల్దేరిన సమయంలో ఈ కుక్క నా దారికి అడ్డంగా నిలిచింది. అసలే ఆకలితో ఉన్న నేను ఆగ్రహాన్ని పట్టలేకపోయాను. ఆ ఆగ్రహంతోనే ఈ కుక్కను గాయపరిచాను. నేను చేసిన పని తప్పేనని ఒప్పుకుంటున్నాను. అందుకుగాను మీరు ఎలాంటి శిక్షను విధించినా సంతోషంగా స్వీకరిస్తాను,’ అంటూ వేడుకున్నాడు సర్వదసిద్ధుడు.

సర్వదసిద్ధునికి ఎలాంటి శిక్ష విధించాలా అని దర్బారులో జనమంతా తర్జనభర్జన పడుతుండగా ఆ శునకం- ‘ప్రభూ! తమరేమీ అనుకోనంటే నాది ఒక విన్నపం. మీకు నిజంగా నా పట్ల జాలి కలిగితే, నన్ను కరుణించాలన్న తలంపు మీలో ఉంటే నేను చెప్పిన శిక్షను అతనికి విధించండి,’ అని కోరింది.

ఆ మాటలకు రాములవారు అంగీకరించగానే- ‘ఈ బ్రాహ్మణుడిని కులపతిగా నియమించండి. అతడిని కలంజర అనే మఠానికి అధిపతిని చేయండి,’ అని కోరింది.

ఆ మాటలు విన్నంతనే సభలోని వారంతా ఆశ్చర్యపోయారు. బ్రాహ్మణుడు మాత్రం తనకు శిక్షకు బదులుగా పదవి లభించినందుకు సంబరపడుతూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ‘అదేమిటీ, నీకు జరిగిన అన్యాయానికి బదులుగా సర్వదసిద్ధుని కఠినంగా శిక్షించమని కోరతావనుకుంటే... అతనికి కులపతి హోదానీ, మఠాధిపతి పదవినీ కట్టబెట్టించావెందుకనీ,’ అంటూ అడిగారు సభలోని పెద్దలు.
 

దానికి ఆ శునకం ఇలా బదులిచ్చింది- ‘అయ్యా గత జన్మలో నేను ఆ మఠాధిపతిని. రుషులను ఆదరిస్తూ, దేవతలని పూజిస్తూ, సేవకుల బాగోగులను గమనిస్తూ, అందరికీ పంచగా మిగిలిన ఆహారాన్ని భుజిస్తూ చాలా నిష్టగా జీవించాను. అయినా కూడా కుక్కగా జన్మించాల్సి వచ్చింది. అంత సత్ప్రవర్తనతో మెలిగిన నేను ఈ స్థితికి చేరుకుంటే... చిన్నపాటి కోపాన్ని కూడా అదుపు చేసుకోలేని ఆ సర్వదసిద్ధుడి గతేమవుతుందో ఆలోచించండి,’ అంటూ నవ్వింది.

అధికారం చేతిలోకి వస్తే మనిషి విచక్షణలో మార్పు వస్తుంది. ఆ మత్తులో అతను తెలిసో తెలియకో చిన్నచిన్న పొరపాట్లు చేయడం ఖాయం. మఠాధిపతి హోదాలో అతిపవిత్రంగా ఉండాల్సిన మనిషి ఇంకెంత నిష్టగా ఉండాలో కదా! ఈ విషయాన్ని సున్నితంగా తెలియచేస్తోంది పై కథ. ఇందులో ఒక పక్క కుక్క చూపించిన సమయస్ఫూర్తి అబ్బురపరచినా... గురువుగా ఉన్నత స్థానాన్ని అలంకరించేవారు ఎంత పవిత్రంగా ఉండాలో హెచ్చరిస్తోంది. 

ఊర్మిళా దేవి నిద్ర

ఊర్మిళాదేవి కోరుకున్న వింత వరం..

రావణసంహారం జరిగిపోయింది. 
రాములవారు దిగ్విజయంగా అయోధ్యకు చేరుకున్నారు. మంచి ముహూర్తంలో అంగరంగవైభోగంగా ఆయనకు పట్టాభిషేకం జరిగింది. 
ఒకరోజున రాములవారు సభలో కూర్చుని ఉండగా యుద్ధానికి సంబంధించిన విషయాలు చర్చకు వచ్చాయి.

14 ఏళ్లపాటు నిద్రాహారాలు లేనిమనిషే ఇంద్రజిత్తుని చంపగలడు. 
లక్ష్మణుడు అలా 14 ఏళ్లపాటు నిద్రాహారాలు లేకుండా గడిపాడు కాబట్టే... ఆయన ఇంద్రజిత్తుని సంహరించగలిగాడు,' అని ఎవరో గుర్తుచేశారు.

ఆ మాటలు విన్న రాములవారికి ఒక అనుమానం వచ్చింది. ''14 ఏళ్లపాటు మమ్మల్ని కంటికి రెప్పలా కాచుకుని ఉండేందుకు నువ్వు నిద్రపోలేదని నాకు తెలుసు.

నీ భార్య ఊర్మిళ ఇక్కడి అంతఃపురంలో ఆ నిద్రని అనుభవించిందని తెలుసు. 
కానీ రోజూ నీకు అందించిన ఆహారాన్ని ఏం చేశావు,' అని అడిగారు.

''మనం వనవాసం చేస్తున్నన్నాళ్లూ, నాకు అందించిన ఆహారాన్ని పంచవటిలోని ఒక చెట్టు తొర్రలో ఉంచేవాడిని,'' అని జవాబిచ్చాడు లక్ష్మణుడు. 
లక్ష్మణుడు చెప్పిన మాటలు సబబుగానే తోచాయి. 
కానీ సరదాగా ఆ ఆహారపు పొట్లాలన్నీ ఓసారి లెక్కపెడదామని అనుకున్నారట. 
దాంతో వాటిని రప్పించి సైనికులతో లెక్కించారు. 
కానీ లెక్కలో ఒక ఏడు రోజుల ఆహారం తగ్గినట్లు తేలింది. 

''లక్ష్మణా! ఓ ఏడు రోజులపాటు ఆహారంగానీ ఆరగించావా ఏం!'' అని పరిహాసంగా అడిగారట రాములవారు.
''అన్నయ్యా! మొదటి సందర్భంలో, తండ్రిగారి మరణవార్త తెలిసిన రోజున మనం ఆహారం తీసుకోనేలేదు. రావణాసురుడు సీతమ్మను అపహరించిన రోజున ఆహారాన్ని తీసుకోవాలన్న ధ్యాసే మనకు లేదు. మైరావణుడు మనల్ని పాతాళానికి ఎత్తుకుపోయిన సందర్భంలో మూడోసారి ఆహారాన్ని సేకరించలేదు. 
నేను ఇంద్రుజిత్తు సంధించిన బాణానికి మూర్ఛిల్లిన రోజున ఎవరూ నాకు ఆహారాన్ని అందించే ప్రయత్నం చేయలేదు. మర్నాడు ఇంద్రుజిత్తుతో భీకరమైన పోరు జరిగే సమయంలోనూ ఆహారాన్ని నాకు అందించే సమయమే చిక్కలేదు. 
ఇక రావణాసురుని సంహారం జరిగిన రోజున బ్రహ్మహత్యాపాతకం జరిగిందన్న బాధతో ఆహారాన్ని అందించలేదు. 
మర్నాడు రావణుని కోసం విలపిస్తున్న లంకావాసులకు తోడుగా మన సేన కూడా ఉపవాసం చేసింది. 
ఇలా ఏడు సందర్భాలలో అసలు ఆహారం నా చేతికి అందే పరిస్థితే రాలేదు,'' అని బదులిచ్చాడు లక్ష్మణుడు.

లక్ష్మణుడి నిబద్ధతకు రాములవారి మనసు కరిగిపోయిందని వేరే చెప్పాలా. 
అదే సమయంలో ఊర్మిళ పట్ల కూడా ఆయన ప్రసన్నులయ్యారు. 

''తల్లీ! వనవాసంలో నువ్వు ప్రత్యక్షంగా మాతోపాటు లేకపోయినా, ఇక్కడ నువ్వు చేసిన త్యాగంతోనే మేము అక్కడ అన్ని సమస్యలని తట్టుకుని నిలబడగలిగాము. అందుకే సీతాలక్ష్మణులతో పాటుగా నువ్వు కూడా మా పక్కనే ఆశీసురాలివై ఉండు!'' అన్నారట రాములవారు.
రాములవారి అనుగ్రహానికి ఊర్మిళ కళ్లు చెమ్మగిల్లాయి. 

కానీ ''ప్రభూ! నాకు నీ పాదపద్మాల దగ్గర చోటుకంటే వేరే వరమేదీ వద్దు. 
ప్రతిరోజూ నీ పాదాల చెంతకి చేరుకుని, నా అనుగ్రహాన్ని పొందే నైవేద్య రూపంలో నేను ఉండేలా అనుగ్రహించు,'' అని వేడుకుందట ఊర్మిళ.

''కలియుగంలో పూరీక్షేత్రంలో నేను కృష్ణుని అవతారంలో వెలుస్తాను. 
నా సోదరుడు లక్ష్మణుడు బలరాముని రూపంలో నాతో తోడుగా ఉంటాడు.
నువ్వు విమలాదేవి అవతారంలో ఆ ఆలయంలోని క్షేత్రపాలకురాలిగా వెలుస్తావు. 
అక్కడ నిత్యం రూపొందించే మహాప్రసాదంలో కొలువై ఉంటావు,'' అంటూ వరాన్ని అందించారట. 
ఆ వరం కారణంగా ఇప్పటికీ పూరిలోని జగన్నాథుని ఆలయం పక్కన విమలాదేవి ఉపాలయం కనిపిస్తుంది. అక్కడ నిత్యం తయారుచేసే మహాప్రసాదాన్ని ఆ అమ్మవారికి నివేదించిన తర్వాత కానీ భక్తులకు అందించరని చెబుతారు. 

పూరీలో నిత్యం 56 రకాల ప్రసాదాలతో వైభవోపేతమైన నైవేద్యం రూపొందే విషయం తెలిసిందే! 

ఆ మహాప్రసాదం వెనుక ఉన్న కథలలో ఈ *ఊర్మిళాదేవి కథ* కూడా విస్తృత ప్రచారంలో కనిపిస్తుంది..స్వస్తి..
శ్రీరామ జయరామ జయ జయరామ..

వైద్యనాథాష్టకము - To heal all your health issues


పరమశివుడు వైద్యులకు అధిపతిగా కూడా పేరొందాడు. శ్రీ రుద్రాభిషేచనంలో చాలా భాగం దీన్ని వక్కాణిస్తుంది.  నమకం, చమకంలో పూర్తి ప్రార్థన, ఫలితం కూడా రోగ నివారణ, ఆరోగ్యము, దీర్ఘాయుష్షు గురించి చెపుతాయి. అందుకనే శివుని వైద్యనాథుడిగా కొలుస్తారు. దీనికి జ్యోతిర్లింగ స్వరూపమే మహారాష్ట్ర అంబజోగై సమీపం లోని వైద్యనాథ దేవాలయం. అలాగే, తమిళనాట చిదంబరం దగ్గర వైదీశ్వరన్ కోవిల్ ఈ స్వామి మహాత్మ్యాన్ని తెలిపేదే.

జటాయు అంత్యక్రియలు, కుష్ఠు వ్యాధితో బాధపడుతున్న అంగారకునికి (కుజ గ్రహం) రోగ నివారణ ఇక్కడే జరిగాయని గాథ. సుబ్రహ్మణ్యునికి శూలము కూడా ఇక్కడ శివుని ప్రార్థించిన తర్వాతే లభించిందని ఇక్కడి ప్రజల విశ్వాసం. ఇక్కడి సిద్ధామృత తీర్థం (పుష్కరిణిలో నీరు), అంగసనాతన తీర్థంలో స్నానం చేసి,  వేప చెట్టు క్రింద మట్టి తీసుకుని పవిత్ర భస్మముతో కలిపి దేవునికి సమర్పించి ఆ సిద్ధామృత తీర్థంతో తీసుకుంటే సర్వ రోగ నివారణ అవుతుందని గట్టి విశ్వాసంv. అలాగే ఆ వైద్యనాథుని ఈ క్రింది స్తోత్రము రోజుకు మూడు సార్లు చదివితే ఆరోగ్యం కలుగుతుందట. అంతటి మహిమాన్వితమైన వైద్యనాథ అష్టకం, తాత్పర్యము మీకోసం. 

శ్రీ రామ సౌమిత్రి జటాయు వేద
షడాననాదిత్య కుజార్చితయ
శ్రీ నీలకంఠాయ దయామయాయ
శ్రీ వైద్యనాథాయ నమశ్శివాయ

తాత్పర్యము: శ్రీ రాముడు, లక్ష్మణుడు, జటాయువు, వేదములు, సుబ్రహ్మణ్య స్వామి, సూర్యుడు, అంగారకుడిచే పూజించబడిన, నీలకంఠము కలవాడు, దయామయుడు, వైద్యనాథుడైన శివునికి నా నమస్కారములుl.

గంగా ప్రవాహేందు జటాధరయ
త్రిలోచనాయ స్మర కాల హంత్రే
సమస్త దేవైరపి పూజితాయ
శ్రీ వైద్యనాథాయ నమశ్శివాయ

తాత్పర్యము: ప్రవహించే గంగను, చంద్రుని జటా ఝూటములో ధరించిన, మూడు కన్నులు కలవాడు, మన్మథుని, యముని సంహరించిన వాడు, దేవతలందరి చేత పూజించ బడినవాడు, వైద్యనాథుడైన శివునికి నా నమస్కారములు.

భక్త ప్రియాయ త్రిపురాంతకాయ
పినాకినీ దుష్ట హరాయ నిత్యమ్
ప్రత్యక్ష లీలాయ మనుష్య లోకే
శ్రీ వైద్యనాథాయ నమశ్శివాయ

తాత్పర్యము: భక్త ప్రియుడు, త్రిపురములను నాశనము చేసిన వాడు, పినాకమును (త్రిశూలమును) చేతిలో ధరించిన వాడు, నిత్యము దుష్టులను సంహరించే వాడు, వైద్యనాథుడైన శివునికి నా నమస్కారములు.

ప్రభూత వాతాది సమస్త రోగ
ప్రణాశ కర్త్రే ముని వందితాయ
ప్రభాకరేంద్ర్వగ్ని విలోచనాయ
శ్రీ వైద్యనాథాయ నమశ్శివాయ

తాత్పర్యము: వాతము, కీళ్ళనొప్పులు మొదలగు రోగములను నాశనము చేసే వాడు, మునులచే పూజించబడిన వాడు, సూర్యుడు, చంద్రుడు, అగ్ని నేత్రములుగా కలవాడు, వైద్యనాథుడైన శివునికి నా నమస్కారములు.

వాక్శ్రోత్ర నేత్రాంఘ్రి విహీన జంతోః
వాక్శ్రోత్ర నేత్రాంఘ్రి సుఖ ప్రదాయ
కుష్ఠాది సర్వోన్నత రోగ హంత్రే
శ్రీ వైద్యనాథాయ నమశ్శివాయ

తాత్పర్యము: వాక్కు, వినికిడి శక్తి, కాంతి చూపు, నడిచే శక్తి కోల్పోయిన జీవ రాశులకు ఆ శక్తులను తిరిగి కలిపించే వాడు,  కుష్ఠు మొదలగు భయంకరమైన రోగములను నిర్మూలము చేసి ఆరోగ్యాన్ని ప్రసాదించే వాడు, వైద్యనాథుడైన శివునికి నా నమస్కారములు.

వేదాంత వేద్యాయ జగన్మయాయ
యోగీశ్వర ధ్యేయ పదాంబుజాయ
త్రిమూర్తి రూపాయ సహస్ర నామ్నే
శ్రీ వైద్యనాథాయ నమశ్శివాయ

తాత్పర్యము: వేదముల ద్వారా తెలుసుకొనే దైవము, విశ్వమంతా వ్యాపించి యున్నవాడు, యోగులచే ధ్యానింపబడిన పాద పద్మములు కలిగిన వాడు, త్రిమూర్తుల రూపమైన వాడు, సహస్ర నామములు కలవాడు, వైద్యనాథుడైన శివునికి నా నమస్కారములు.

స్వతీర్థ మృడ్భస్మ భృతాంగ భాజాం
పిశాచ దుఃఖార్తి భయాపహాయ
ఆత్మ స్వరూపయ శరీర భాజాం
శ్రీ వైద్యనాథాయ నమశ్శివాయ

తాత్పర్యము: ఆయన దేవాలయమున ఉన్న పుణ్య పుష్కరిణీ స్నానము వలన, వేపచెట్టు క్రింద మట్టి మరియు భస్మము వలన - భూత ప్రేతముల బాధ, దుఃఖములు, కష్టములు, భయములు, రోగములు తొలగించే, ఆత్మ స్వరూపుడై దేహము నందు నివసిస్తున్న,  వైద్యనాథుడైన శివునికి నా నమస్కారములు.

శ్రీ నీలకంఠాయ వృష ధ్వజాయ
స్రక్గంధ  భస్మాద్యభి శోభితాయ
సుపుత్రదారాది సుభాగ్యదాయ
శ్రీ వైద్యనాథాయ నమశ్శివాయ

తాత్పర్యము: నీలకంఠుడు, వృషభమును (ఎద్దును) పతాకమందు చిహ్నముగా కలవాడు,  పుష్పములు, గంధము, భస్మముచే అలంకరించబడి శోభిల్లే వాడు, సుపుత్రులు, మంచి ధర్మపత్ని, సత్సంపదలు, అదృష్టములు ఇచ్చే వాడు,  వైద్యనాథుడైన శివునికి నా నమస్కారములుl.

 ఫల శ్రుతిః 

బాలాంబికేశ వైద్యేశ భవ రోగ హరేతి చ
జపేన్నామ త్రయం నిత్యం మహారోగ నివారణం

ఫల శృతి: బాలాంబిక పతి, జరామరణముల భయమును పోగొట్టేవాడు అయిన వైద్యనాథుని ఈ వైద్యనాథాష్టకం ప్రతి దినము మూడు సార్లు పఠించే వారికి సకల రోగ నివారణ కలుగును.

తెలివైన చిట్టి చిలుక

ఒక వ్యక్తి పట్టణంలో జరుగుతున్న సత్సంగానికి  ప్రతిరోజు వెళ్ళుతుండేవాడు.

ఆ వ్యక్తి ఒక చిలుకను పంజరములో ఉంచి పోషించేవాడు.

ఒక రోజు చిలుక తన యజమానిని అడిగింది, 'మీరు ఎక్కడకు రోజు వెళ్తున్నారు' అని?

అతను ఇలా అన్నాడు, "మంచి విషయాలు తెలుసుకోవడానికి నేను రోజూ సత్సంగానికి వెళతాను."
"మీరు నాకు ఒక సహాయం చేయగలరా?" అని అడిగింది ఆ చిట్టిచిలుక ఆ యజమానిని. "నేను ఎప్పుడు స్వేచ్ఛ పొందగలను అని మీ గురువు గారిని అడిగి చెప్పండి" అని.

మరుసటి రోజు, యజమాని సత్సంగానికి వెళ్ళాడు.

సత్సంగం ముగిసిన తర్వాత, అతను గురువు దగ్గరకు వెళ్లి, "మహారాజ్, నా ఇంటిలో ఒక చిలుక ఉంది, అది స్వేచ్ఛ ఎప్పుడు పొందగలదో మిమ్మలను అడిగి తెలుసుకోమని ప్రాధేయపడింది" అని.

అది విన్న వెంటనే, గురువుగారు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు.

ఇది చుాసిన చిలుక యజమాని భయపడి,నిశ్శబ్దంగా అక్కడ నుండి వెళ్ళిపోయాడు.

అతను ఇంటికి చేరుకొన్నాడు. అతని చిలుక అతనిని అడిగింది, 'మీరు నా ప్రశ్నను గురువుగారిని అడిగారా?' అని.

యజమాని బదులిచ్చాడు- 'నేను అడిగాను కానీ నీ అదృష్టం బాగాలేదు. నేను నీ ప్రశ్న అడిగిన వెంటనే, గురువుగారు అపస్మారక స్థితి లోకి వెళ్లిపోయారు' అని.

"సరే సరే, నేను అర్థం చేసుకున్నాను" అన్నది ఆ చిలుక.

మరుసటి రోజు సత్సంగానికి వెళ్తూ, యజమాని పంజరంలో ఉన్నచిలుక అపస్మారక స్థితిలో ఉండడాన్ని చూశాడు.

యజమాని పరీక్షగా చూసి చిలుక చనిపోయిందనుకుని  బయటకు తీసాడు. దానిని నేలమీద ఉంచాడు. వెంటనే ఆ చిలుక రివ్వుమంటూ ఎగిరిపోయింది. 

చేసేది లేక సత్సంగం కోసం మామూలుగా వెళ్లాడు ఆ యజమాని.

గురువు అతనిని చూసి, దగ్గరకు పిలిచి, "నీ చిలుక ఎక్కడ ఉంది?" అని అడిగాడు.

"నేను ఉదయం సత్సంగానికి వచ్చేటప్పుడు, నా చిలుక అపస్మారక స్థితికి గురై, పంజరంలో పడి ఉంది. దాని ఆరోగ్యం తనిఖీ చేయడానికి నేను పంజరం తెరిచి దానిని నేలమీద ఉంచినప్పుడు, అది పారిపోయింది" అని దిగులుగా చెప్పాడు.

గురువు నవ్వి, "మీ చిట్టిచిలుక మీ కన్నా ఎక్కువ తెలివిగలది. అది నేను ఇచ్చిన చిన్న సూచన అర్థం చేసుకుని
ఆచరణలో పెట్టి స్వేచ్ఛను పొందగలిగింది.

కానీ మీరు చాలా రోజుల పాటు సత్సంగానికి వస్తూ కూడా సాధన చేయక, ఈ ప్రపంచంలోనే  భ్రమ అనే పంజరంలో చిక్కుకొని ఉన్నారు."
అని అన్నాడు.
యజమాని సిగ్గుతో తలదించు కొన్నాడు.
దూరం నుంచి చిలుక గురువుకు కృతజ్ఞతలు తెలుపుకుంది.

నీతి : సత్సంగం యొక్క ఉద్దేశం కేవలం భక్తికోసం కాదు, కాలక్షేపం కోసం కానే కాదు. అజ్ఞానం నుండి, అంధకారం నుండి,భ్రమ నుండి మనం బయటపడి స్వేచ్ఛగా విముక్తలమై దైవానికి చేరువకావడం కోసం అని గ్రహించాలి.

హనుమకృత సీతారామ స్తోత్రమ్

అయోధ్యా పుర నేతారం మిథిలా పుర నాయికాం !
రాఘవాణాం అలంకారం వైదేహీనాం అలంక్రియాం !!

రఘూణం కుల దీపం చ నిమీనం కుల దీపికాం !
సూర్య వంశ సముద్భూతమ్ సోమ వంశ సముద్భవాం !!

పుత్రం దశరథస్యాద్యమ్ 
పుత్రీం జనక భూపతే!
వసిష్టాను మతాచారం శతానంద మతానుగం !!

కౌసల్యా గర్భ సంభూతం 
వేదిగర్భోదితం స్వయం !
పుండరీక విశాలాక్షం స్ఫురదిందీ వరేక్షణాం !!

చంద్రకాంతాననాంభోజం 
చంద్ర బింబోపమాననం !
మత్త మాతంగ గమనం 
మత్త హంస వధూ గతాం !!

చందనార్ద్ర భుజా మధ్యం కుంకుమార్ద్ర కుచస్థలీం !
చాపాలంకృత హస్తాబ్జం పద్మాలంకృత పాణికాం !!

శరణాగత గోప్తారం
 ప్రణిపాత ప్రసాదికాం !
కాలమేఘ నిభం రామం 
కార్త స్వర సమ ప్రభాం !!

దివ్య సింహాసనాసీనం దివ్యస్రగ్వస్త్ర భూషణాం !
అనుక్షణం కటాక్షాభ్యాం అన్యోన్య క్షణ కాంక్షిణూ !!

అన్యోన్య సదృశాకారౌ త్రైలోక్య గృహ దంపతి !
ఇమౌ యువాం ప్రణమ్యాహం భజామ్యద్య కృతార్థతాం !!

అనేన స్తోతి యః స్తుత్యం రామం సీతాంచ భక్తితః !
తస్య తౌ తనుతాం పుణ్యాస్సంపదః సకలార్థదాః !!

ఏవం శ్రీరామ చంద్రస్య జానక్యాశ్చ విశేషతః !
కృతం హనుమతా పుణ్యం స్తోత్రం సద్యో విముక్తిదం
యః పఠేత్ ప్రాతరుత్థాయ సర్వాన్ కామనవాప్నుయాత్ !!
ఇతి శ్రీ సీతారామస్తోత్రం సంపూర్ణం


ప్రతి శ్లోకంలో మొదటిభాగం స్వామివారి గురించి, రెండవ భాగం అమ్మవారి గురించి చెప్తూ హనుమంతుడు చేసిన స్తుతి.

రామచంద్రాయ జనక
రామచంద్రాయ జనక రాజజా మనోహరాయ
మామకాభీష్టదాయ మహితమంగళం || ||రామ||

కౌసలేశాయ మందహాస దాసపొషనాయ
వాసవాది వినుత సద్వరాయ మంగళం || ||రామ||

చారు మేఘ రూపాయ చందనాది చర్చితాయ
భాన కటక శోభితాయ భూరి మంగళం || ||రామ||

లలిత రత్న కుండలాయ తులసీ వనమాలికాయ
జలజ ఘతుక దేహాయ చారు మంగళం || ||రామ||

దేవకీ సుపుత్రాయ దేవ దేవోదత్తమాయ
చావజాత గురువరాయ సర్వ మంగళం || ||రామ||

పుండరీకాక్షాయ పూర్ణచంద్రాననాయ
అండజాత వాహనాయ అతుల మంగళం || ||రామ||

విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ
సుముఖ చిత్త కామితాయ శుభగ మంగళం || ||రామ||

రామదాసాయ మ్రుదుల హృదయ కమల వాసాయ
స్వామి భద్రగిరివరాయ సర్వ మంగళం || ||రామ||

Sunday, April 12, 2020

రామతత్వం పరమాత్మ ధర్మం

*వేదవేద్యే పురేపుంసీ జాతే ధశరధాత్మజే* 
 *వేద: ప్రాచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన:* 

ఉపాసన విషయం లో ఒక్కో అధిష్ఠాన దేవతకి ఒక్కో రకమైన ప్రత్యేకత ఉంటుంది.... 

రామ తత్వాన్ని తీసుకుంటే రాముని భక్తుడిగా ఉండటం అంత ఆషామాషీ వ్యవహారం మాత్రం కాదు... 
ఎందుచేత ఈ మాట అంటున్నారు అనంటే సాక్షాత్తు ధర్మదేవత కి ప్రతిరూపమై భూమిపై నడయాడిన స్వరూపం శ్రీ రామ చంద్ర స్వామి...

ఎంత ఉపాసన చేసినప్పటికీ  ఎంత ఆరాధ్య భావాన్ని ప్రకటించుకున్నప్పటికినీ ఆ స్వామి ని అర్థం చేసుకుని ఆయన భక్తుడిగా కడదాక కొనసాగగలగడం నిజం గా కత్తిమీద సామే......

శ్రీ రామ చంద్ర స్వామి కి భక్తాగ్రేసరుడైన కంచర్ల గోపన్న గారు కూడా రామ భక్తుడిగా ఎన్నో పరీక్షలను ఎదుర్కొన్న విషయం మనం గుర్తుంచుకోవాలి... 

తన జీవితం అంతా రామ భక్తి కోసం పరితపించిన మహనీయుడికి కూడా పరీక్ష తప్పలేదు... 

చరసాలలో వేసినా క్షరాన్నాన్ని పెట్టినా ఆయన రాముడికోసమే తపన పడినాడు తప్ప నాస్తికుడిగా మారలేదు... 

ఇంత పిలిచినా వేడుకున్నా తనకు రాముడు దర్శనం ఇవ్వలేదని ఏడిచినా కూడా ఆ రామచంద్ర స్వామి తన దర్శనాన్ని తానీషా కే ముందుగా ఇచ్చాడు... 

ఆ సమయంలో సామాన్య భక్తులైతే వెంటనే నన్ను కొట్టి ఖైదు చేసిన తానీషా పై ఉన్న పాటి కరుణ కూడా నా మీద లేదా అంటూ అసలు నువ్వు దేవుడివేనా అంటూ భక్తి మార్గాన్ని తెంచుకుని దారి తప్పినా ఆశ్చర్యం లేదు...
 రామదాసు గారు కూడా ఎంతో దుఖ్ఖించారు.. ప్రాదేయపడినారు

నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి నను బ్రోవమని చెప్పవే... అంటూ అమ్మ కి చెప్పి సేద తీరారు...

అలాంటి రామదాసు గారికి చివరకు మోక్షం ప్రసాదించిన దైవం కూడా ఆ రామ చంద్రుడే...

చివరగా చెప్పేదేమంటే ధర్మ మార్గం లో నడవగలిగిన ధైర్యం ఉన్నవాడే నీతి నిజాయితీ లకు కట్టుబడిన నాడే పితృవాక్య పరిపాలనా ప్రాజ్ఞుడిగా మారిన నాడే  మనం ఆ రామభద్రుని పాదాలను కడదాకా మనసు లో నిలుపుకోగలం.. ..

అలా నిలుపుకోవడమే నిజమైన పరిణతి తో కూడిన భక్తి అవుతుంది...

 ఎన్ని యుగాలు మారినా పదునాలుగు భువన భాండమ్ముల నిండా దశ దిశలలోనూ పరివ్యాప్తమై ఉన్నది రామతత్త్వం ఒక్కటే.

Vontimitta Kodandarama Swamy Temple

అత్యంత పురాతనమైన ఈ ఆలయంలోని సీతారామ లక్ష్మణ విగ్రహాలు విడి విడిగా వున్నా ఏక రాతిలో చెక్కబడినవి.
ఇంకొక విశేషం ఇక్కడ గర్భగుడిలో ఆంజనేయస్వామి వుండరు. ఆయన్ని కలుసుకోవటానికి ముందే సీతారామ లక్ష్మణులు ఇక్కడ సంచరించారనీ, అందుకని ఆంజనేయస్వామి విగ్రహం ఇక్కడ ప్రతిష్టింపబడలేదని అభిజ్ఞుల అభిప్రాయం. వనవాస సమయంలో సీతారామ, లక్ష్మణులు ఇక్కడ సంచరిస్తూ వుండగా సీతమ్మకి దాహం వేసింది. అప్పుడు శ్రీరామచంద్రుడు తన బాణంతో పాతాళ గంగను రప్పించాడు. ఆ తీర్ధం రామ తీర్ధంగా ఇప్పటికీ అక్కడ వున్నది.

ఒక మిట్టమీద నిర్మింపబడ్డ రామాలయం అవటంవల్ల ఈ ఆలయానికి ఒంటిమిట్ట రామాలయం అని పేరు వచ్చింది. ఈ ఆలయంలోని విగ్రహాలు ఒకే శిలలో మలచబడ్డాయి. అందుకే దీనికి ఏక శిలా నగరమనే పేరు వచ్చింది.

ఇంకొక కధనం ప్రకారం ఒంటుడు, మిట్టుడు అనే ఇద్దరు రామ భక్తులు (వీరు చోరులు అని కూడా అంటారు) ఈ ఆలయాన్ని నిర్మించారు. నిర్మాణం పూర్తయిన తర్వాత వారు తమ జీవితాలని అంతం చేసుకున్నారు. వారి శిలా విగ్రహాలు ఆలయంలో ప్రవేశించటానికి ముందు చూడవచ్చు.
మహా భాగవతకర్త పోతన తాను ఏక శైలపురివాసినని చెప్పుకున్నాడు. భాగవతంలో తానీ ప్రాంతానికి చెందినవాడనే మాటలు కొన్ని వుండటంవల్లకూడా పోతన కొంత కాలం ఇక్కడ నివసించినట్లు భావిస్తారు. పోతన జన్మ స్ధలం గురించి ఎన్నో వివాదాలున్నాయి. అయినా ఆయన రచించిన భాగవతాన్ని అంకితమిచ్చింది కోదండరాముడికే. ఆలయంలో ఈ సహజ కవి విగ్రహాన్ని దర్శించవచ్చు.

తెలుగులో తొలి యాత్రా రచన .. కాశీ యాత్ర చరిత్ర .. లో ఈ గ్రామ ప్రస్తావన వున్నది. ఆ గ్రంధకర్త ఏనుగుల వీరాస్వామి కాశీ యాత్రలో భాగంగా అత్తిరాలనుంచి భకరాపేట వెళ్ళే మార్గంలో ఒంటిమిట్టనుంచి వెళ్ళారు. ఈ గ్రంధ రచన క్రీ.శ. 1830లో జరిగింది. ఆ సమయంలో గ్రామం నాలుగు పక్కల కొండలు మధ్యలో భారీ చెరువున్నది. చెరువుకట్టమీద వున్న బాటమీద ఆయన ప్రయాణం చేశారు. అప్పట్లో అది గ్రామమనీ, గ్రామంలో చక్కటి గుళ్ళు, యాత్రికుల నిలయం వున్నాయని పేర్కొన్నారు.

రామ లక్ష్మణులు చిన్న వయసులోనేకాక సీతా రామ కళ్యాణం తర్వాత కూడా మృకండ మహర్షి, శృంగి మహర్షి కోరికమీద యాగ రక్షణకి, దుష్ట శిక్షణకీ శ్రీరామ లక్ష్మణులు అంబులపొది, పిడిబాకు, కోదండం పట్టుకుని ఈ ప్రాంతానికి వచ్చి యాగ రక్షణ చేశారని ఒక కధనం. అందుకు ప్రతిగా ఆ మహర్షులు సీతా రామ లక్ష్మణుల విగ్రహాలను ఏక శిలలో చెక్కించారనీ, తర్వాత జాంబవంతుడు ఈ విగ్రహాలకు ప్రాణ ప్రతిష్ట చేశాడనీ ఇక్కడివారి విశ్వాసం.

సందర్శకులను ఆకర్షించే అంశాల్లో ఇంకొకటి ఇమాంబేగ్ బావి. 1640 సం. లో కడపను పాలించిన అబ్దుల్ నబీఖాన్ ప్రతినిధి ఇమాంబేగ్. ఒకసారి ఆయన ఈ ఆలయానికి వచ్చిన భక్తులను మీ దేవుడు పిలిస్తే పలుకుతాడా అని ప్రశ్నించాడుట. చిత్త శుధ్ధితో పిలిస్తే ఖచ్చితంగా పలుకుతాడని వారు సమాధానం ఇవ్వగా ఆయన మూడు సార్లు రాముణ్ణి పిలిచారట. అందుకు ప్రతిగా మూడు సార్లు ఓ అని సమాధానం వచ్చింది. ఆయన ఆశ్చర్య చకితుడై, స్వామి భక్తుడిగా మారి, అక్కడి నీటి అవసరాలకోసం ఒక బావిని తవ్వించాడు. ఆయన పేరుమీద ఆ బావిని ఇమాంబేగ్ బావి అటారు. అప్పటినుంచి ఎందరో ముస్లిం భక్తులు కూడా ఈ ఆలయం సందర్శిస్తూ వుంటారు.

ఫ్రెంచి యాత్రికుడు టావెర్నియర్ 16 వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని దర్శించి, భారత దేశంలో పెద్ద గోపురాలలో ఈ ఆలయ గోపురం ఒకటి అని శ్లాఘించాడు.

ఆలయ నిర్మాణం:

* పొత్తపి చోళులు, విజయనగర రాజులు, మట్టిరాజులు ఈ ఆలయాన్ని మూడు దశలలో నిర్మించారు.

* మూడు గోపురాలతో, విశాలమైన ఆవరణలో అలరారే ఈ ఆలయం ముఖద్వారం ఎత్తు సుమారు 160 అడుగులు.

* ఈ ఆలయంలో మధ్య మండపంలో 32 స్తంబాలున్న రంగమంటపం వున్నది. సందర్శకులను ఆకట్టుకునే ఈ స్తంభాల మీద శిల్ప కళ చోళ, విజయనగర శిల్ప శైలిని పోలి వుంటుంది. ఈ స్తంబాలపై రామాయణ, భారత కధలను చూడచ్చు.

* గుడి ఎదురుగా సంజీవరాయ దేవాలయం, పక్కగా రధశాల, రధం వున్నాయి.

* పోతన, అయ్యల రాజు రామభద్రుడు, ఉప్పు గుండూరు వేంకటకవి, వరకవి మొదలగు ఎందరో స్వామికి కవితార్చన చేసి తరించారు.

* అన్నమాచార్యుడు ఈ ఆలయాన్ని దర్శించి స్వామిమీద కొన్ని కీర్తనలు రచించారు.

* ప్రౌఢ దేవరాయల ఆస్ధానంలో అయ్యల తిప్పరాజు ఈ ప్రాంతవాసి. ఈయన స్వామిపై ... శ్రీ రఘువీర శతకాన్ని రచించారు. ఇతని మనవడే అష్ట దిగ్గజాల్లో ఒకరయిన అయ్యల రాజు రామభద్రుడు. 

వాల్మీకి రామాయణాన్ని తెలుగులోకి అనువదించి, ఆంధ్ర వాల్మీకిగా పేరుపొందిన శ్రీ వావిలకొలను సుబ్బారావు (1863 – 1936) రెవెన్యూ ఉద్యోగి. ఈయన తన ఉద్యోగానికి రాజీనామా చేసి తన జీవితాన్ని ఈ ఆలయ పునరుధ్ధరణకి అంకితం చేశారు. ఊరూరా భిక్షమెత్తి ఈ ఆలయానికి భూములు, భవనాలు, స్వామికి విలువైన ఆభరణాలు ఏర్పాటు చేశారు. ఈయన రామాయణాన్ని తెలుగులో రచించి దానికి “మందరం” అనే పేరుతో వ్యాఖ్యానం కూడా రాశారు.

మార్గము:
కడపనుంచి రాజం పేట వెళ్ళే మార్గంలో కడపకి 27 కి.మీ. ల దూరంలో వున్నది. కడపనుంచి బస్సు సౌకర్యం వున్నది.

ఉత్సవాలు:
చైత్ర శుధ్ధ నవమినుండి బహుళ విదియ వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అందులో

చతుర్దశినాడు కళ్యాణం, పౌర్ణమినాడు రధోత్సవం, నవమినాడు పోతన జయంతి జరుగుతాయి.

నమ్మకం విలువ ఖచ్చితంగా చెప్పే రామ సేతు

  శ్రీరాముడు రావణునితో
యుద్ధం చేసి అతనిని సంహరించాడు
యుద్ధం ముగిసింది ఆ రాత్రి రామలక్ష్మణులు
కపి సైన్యంతో సముద్ర తీరంలో విశ్రమించారు

అర్థరాత్రి అయింది .......
రాముడు లేచి సముద్రం దగ్గరకు వెళ్ళాడు
ఒక్కొక్క రాయి తీసికొని
సముద్రం నీటిలో వేస్తున్నాడు
 ప్రతి రాయి మునిగిపోతుంది
రాముడు లేచి కడలి చెంతకు వెళ్ళడం
గమనించిన హనుమంతుడు
తాను రాముని వెంట వెళ్ళాడు
రాముడు రాళ్ళను సముద్రంలో
వేయడం గమనించారు
రాముని ముందుకు వెళ్ళి నమస్కరించి మహాప్రభూ ఎందుకిలా రాళ్ళను
అంబుధిలో వేస్తున్నారు అని ప్రశ్నించాడు

హనుమా  ! నువ్వు నాకు
అబద్ధం చెప్పావు అన్నాడు రాముడు
అదేమిటి స్వామి నేను మీకు
అబద్ధం చెప్పానా  ?
ఏమిటి స్వామి అది  ?
ఆశ్చర్యంతో అడిగాడు ఆంజనేయుడు
వారధి కట్టేటప్పుడు నా పేరు
జపిస్తూ రాళ్ళను కడలిలో వేశామని
అవన్నీ తేలి వంతెనలాగా ఏర్పడ్డాయని చెప్పావు నిజమేనా ? అన్నాడు రాముడు
అవును స్వామీ  !..
నా పేరు జపింవి వేసిన రాళ్ళు
తేలడం నిజమైతే
నేను స్వయంగా వేస్తున్న రాళ్ళు
ఎందుకు తేలడం లేదు  ?
మునగడానికి కారణమేమిటి  ?..
నువ్వు చెప్పిన మాట అబద్ధం కాదా  !..
అడిగాడు రాముడు
హనుమంతుడు వినయంగా
చేతులు కట్టుకుని ఇలా అన్నాడు
రామచంద్ర ప్రభూ  !  ....
మేము మిమ్ము మీ శక్తిని నమ్మాము
మీ మీద నమ్మకంతో వేశాము
మా నమ్మకం వలన అవి తేలాయి
మీకు మీ శక్తి మీద నమ్మకం లేదు
అనుమానంతో అపనమ్మకంతో
రాళ్ళను వేశారు
అందుకే  అవి మునిగిపోయాయి
నమ్మకం విలువ అది

మన ఇతిహాసాలు

*అపరిమిత బలము కలిగిన భీముడు ఒక పాము చేతిలో బంధీకృతుడు కావడo*
ఒకరోజు భీముడు వేటనిమిత్తం హిమాలయ శిఖరం మీదకు వెళ్ళాడు. అక్కడ ఒక కొండచలువ భీముని ఆహారంగా పట్టుకుంది. అది భీముని తన శరీరంతో చుట్టేసింది. భీముని బలం ఆ కొండచిలువ బలం ముందు చాలలేదు. భీముడు ఆశ్చర్యపడి "నా వంటి బలవంతుని ఇలా బంధించే శక్తి నీకు ఎలా వచ్చింది? నీవు వరప్రసాదివా? " అని అడిగాడు. ఆ కొండచిలువ భీమునితో ఇలా పలికింది " భీమసేనా నేను నహుషుడు అనే మహారాజును. ఒకప్పుడు దేవేంద్రపదవిని అధిష్టించాను. కాని ఒకమునివరుని శాపం వలన సర్పరూపం దాల్చాను " అని దు॰ఖించాడు.

ఇంతలో భీమసేనుడు కనపడలేదని కలత పడి ధర్మరాజు అతడిని వెతుకుతూ వచ్చాడు. కొండచులువ బంధించి ఉన్న భీముని చూసి " ఆహా ఏమి కాల మహిమ? అపరిమిత బలము కలిగిన భీముడు ఒక పాము చేతిలో బంధీకృతుడు కావడమా? " అనుకున్నాడు. ధర్మరాజు కొండచిలువను చూసి " అయ్యా నీవు ఎవరు? రాక్షసుడివా దేవతవా చెప్పు. నేను పాండురాజు పుత్రుడను. నా పేరు ధర్మరాజు. నీవు నా తమ్ముని కేవలం ఆహారం కొరకు పట్టుకుంటే అతడిని విడిచిపెట్టు. నేను నీకు తగినంత మృగమాంసం సమకూరుస్తాను " అన్నాడు. ధర్మజా! నేను నీవంశంలో పుట్టిన వాడను. నా పేరు నహుషుడు. నేను ఇంద్రుడితో సమానుడను. ఐశ్వర్య గర్వంతో వివేకం లేక సప్తఋషులతో పల్లకి మోయించుకుని వారిని అవమానించాను.ప్రత్యేకంగా అగత్యుడిని అవమానించి కారణంగా అతడు నన్ను పాముగా పడి ఉండమని శపించాడు. ఆశాపప్రభావంతో ఇక్కడ సర్పరూపంలో పడి ఉన్నాను.

నా శాపవిమోచనం కొరకు నాకు పూర్వజన్మ స్మృతి ఉండేలా అనుగ్రహించమని వేడుకున్నాను. అగస్త్యుడు కరుణించి నా ప్రశ్నలకు ఎవరు సమాధానం చ్ప్తారో వారి వలన శాపవిముక్తి కలుగుతుందని చెప్పాడు. ఆ మహానుభావుని కొరకు నిరీక్షిస్తూ ఇలా పడి ఉన్నాను. నీకు శక్తి ఉంటే నా ప్రశ్నలకు సమాధానం చెప్పి నీ తమ్ముని విడిపించుకో. ధర్మరాజు "అయ్యా! నీవు అడిగే ప్రశ్నలకు విజ్ఞులైన బ్రాహ్మణులు మాత్రమే చెప్పగలరు నాకు సాధ్యమా? అయినా ప్రయత్నిస్తాను. అడుగు " అన్నాడు.కొండచిలువరూపంలో ఉన్న నహుషుడు మొదటి ప్రశ్న ఇలా వేసాడు.ఏ గుణములు కలవాడు బ్రాహ్మణుడు? అతను తెలుసుకోదగిన విష్యమేమిటి? ". జవాబుగా ధర్మరాజు " సత్యము, క్షమ, దయ, శౌచము, తపము, దానము, శీలము మొదలైన గుణములు కలిగిన వాడు బ్రాహ్మణుడు. సుఖము దు॰ఖము ఎడల సమబుద్ధి కలిగి ఉండటమే అతను తెలుసుకోదగిన ఉత్తమ విద్య " అన్నాడు.

నహుషుని రెండవ ప్రశ్న " శూద్రుడు పైన చెప్పిన గుణములు శూద్రునిలో కనిపిస్తే అతను బ్రాహ్మణుడు అని పిలువబడతాడా? అలా అయితే కుల విభాగములు ఎందుకు? అధికులు హీనులు అనే వివేకం అపార్ధం కాదా? ధర్మరాజు " మహాత్మా! ఏకారణం చేతనైనా వర్ణసంకరం ఏర్పడినప్పుడు ఎవరు ఏ వర్ణమునకు చెందిన వారు అని తెలియజేయుటకు స్వాయంభువమనువు ఒక పరీక్ష పెట్టాడు. సత్యమూ మొదలగు గుణములు శూద్రుడు ఉత్తమమైన శూద్రుడు కాగలడు కాని బ్రాహ్మణుడు కాగలడా? అదే విధంగా సత్యమూ మొదలగు గుణములు లేని వాడు బ్రాహ్మణుడు కాగలడా? కనుక ఒక వ్యక్తి గుణములు నిర్ణయించుటకు అతని గుణశీలములు ముఖ్యము. గుణశీలములు కలవాడు ఇంకా ఉత్తముడు కాగలడు. గుణశీలములు లేనివాడు వాటిని కాపాడుకోలేడు. కనుక ధనాన్ని రక్షించటం కంటే గుణశీలములు కాపాడుకోవడం ఉత్తమం " అని జవాబిచ్చాడు.

నహుషుని మూడవ ప్రశ్న. " పరులకు అపకారం చేసి, అసత్యములు చెప్పి కూడా అహింసను కఠినంగా ఆచరించినవాడు ఉత్తమ గతులు పొందగలడు. అహింస అంత పవిత్రతను పొందింది ? " ధరరాజు " దానం చెయ్యడం, ఇతరులకు ఉపకారం చెయ్యడం, సత్యం పలకడం, అహింసను పాటించడం అనేవి నాలుగు ఉత్తమ ధర్మములు కాని వాటిలో అహింస విశేషమైంది. దేవతా జన్మ, జంతుజన్మ, మానవజన్మ అనునవి మానవునికి కలుగు జన్మలు. దానము మొదలగు కర్మలు ఆచరిస్తూ అహింసా వ్రతం ఆచరించువాడు దైవత్వాన్ని పొందుతాడు. సదా హింస చేయువాడు జంతువుగా పుడతాడు. అందుకని అహింస పరమ ధర్మంగా పరిగణించబడుతుంది " అని జవాబిచ్చాడు. ఈ సమాధానం విని భీముని వదిలాడు. తన సర్ప రూపం వదిలి దివ్యమైన రూపం పొందాడు*