భారతీయ జ్ఞానసంపద పురాతన కాలం నుండీ విలక్షణంగా విరాజిల్లుతున్నది. ప్రపంచ నాగరికతలు ప్రారంభమయ్యే సరికే భారతావని లో జ్ఞానసంపద సాగరమై విలసిల్లింది. ‘అతతి సర్వత్ర వ్యాప్నోతి ఇతి ఆత్మః’. ‘అంతటా వ్యాపించి ఉన్నదే ఆత్మ..’ అంటూ ఏనాడో ఆత్మకు నిర్వచన మిచ్చి ఆత్మసాక్షాత్కారం పొందిన పవిత్ర నేల ఇది. వేదాలు కర్మకాండల ద్వారా దేవతల దీవెన లు పొందేందుకు నిర్దేశించి ఉండగా, కొంతమంది ఋషులు తర్కమార్గంలో సమస్త చరాచరానికి హేతువు ఎవరనే ఆసక్తితో శోధన మొదలుపెట్టారు. వారు కనిపించే ప్రాకృతిక పదార్థాల మూలతత్త్వా న్ని ఆధారంగా చేసుకుని, కంటికి కనిపించని అనంతతత్వాన్ని పట్టుకున్నారు. ఆ జ్ఞానసంపదను ‘వేదాంతాలు’గా చెప్పబడే ఉపనిషత్తుల రూపంలో నిక్షిప్త పరిచారు. ప్రాకృతిక రూపాలకు హేతువైన సూర్యుడిని ఛేదించి, ఆ తేజస్సుకు ఆవల ఉన్న దానిని అన్వేషించి దాన్ని సాధించడం ఉపనిషత్తుల్లో కనిపిస్తుంది.
ఈ జ్ఞానఫలాలు జిజ్ఞాసి సాధన చేయనంత వరకు అర్థం కావంటే అతిశయోక్తి కాదు. ‘పూర్ణమదః పూర్ణమిదం’ అన్నది శాస్త్రం. అంటే, పూర్ణమైనటువంటి ఆత్మనుండే దృశ్యమాన ప్రపంచం ఉద్భవించింద నీ, ఆ పూర్ణం నుండి ఏ పూర్ణాన్ని తీసి వేసినా పూర్ణమే మిగులుతుందని ఓ అద్భుత నాందీ ప్రస్తావన ‘ఈశావాస్యోపనిషత్తు’లో కనిపిస్తుంది. ఈ శ్లోకార్థం ఖగోళ, గణితసూత్రాలను ప్రతిబింబిస్తుంది.
జ్ఞానం అరిషడ్వర్గాలను హరించి వేస్తుంది. తపస్సు, ధ్యానం లాంటివి అరిషడ్వర్గాలకు తాత్కాలిక విరామాన్నే ఈయగలుగుతాయి. విశ్వామిత్రుడు, దుర్వాసుడులాంటి వారి చరిత్రలు నిరూపించింది కూడా ఇదే. కానీ, జ్ఞానమొక్కటే మేథలో ఆత్మతత్త్వాన్ని నిలుపగా అరిషడ్వర్గాలకు చోటులేకుండా పోతుంది. ఐతే, ఆత్మతత్త్వాన్ని అర్థంచేసుకోవడం అంత సులువైన విషయం కాదు. అర్థమైనా ఆచరించడానికి నిరంతర తపన అవసరం. ఆదిశంకరులు విశ్వనాథుని దర్శనార్థం గంగానదినుండి బయలుదేరగా, ఎదురైన అపరి శుభ్ర వ్యక్తిని పక్కకు తప్పుకోమంటాడు.
ఆ తర్వాత ఆ వ్యక్తి ఆత్మ చైతన్య తత్త్వాన్ని ఈ అద్వైత సిద్ధాంతకర్తకే విడమర్చి చెప్పడం సదా స్మరణీయం. అంతుచిక్కని జ్ఞానం సముపార్జించడమంటే, వేదవేదాంగాలను మించిన పనిగా ‘ముండకోపనిషత్తు’ప్రకటించింది.
ఉపనిషత్తుల అధ్యయనం అనేది జిజ్ఞాసిని, చరాచర ప్రపం చాన్ని సృష్టించి, తనలోనే నిలుపు కున్న ఆ అనంత విశ్వాంత రాళాల లోకి తీసుకెళ్తుంది. ఆత్మతత్త్వాన్ని దొరకబుచ్చుకున్న సాధకుడిని ఆ తాత్త్వికత ఓ అద్భుతమైన వర్ణనాతీ తమైన ఆనంద డోలికల్లో ఓలలాడింప జేస్తుంది. ఆత్మసాక్షాత్కారం సాధకుడిని ’అహం బ్రహ్మాస్మి’ గా మార్చివేస్తుంది. అతనిలో భేదభావం నశించిపోతుంది. దీనివల్ల అలాంటి వారు ‘సర్వాంతర్యామి’ని తనలోనే అనుభస్తారు. తను చూసే దృశ్యమాన ప్రపంచం అంతా తానుగానే గ్రహిస్తారు. అదో అవ్యాజమైన, అనిర్వచనీయమైన ఆనందస్థితి. ‘కేనోపనిషత్తు’లో ప్రకటించినట్లుగా ప్రతి చైతన్యస్థితిలోనూ ఆత్మ ను గ్రహించే వ్యక్తే జ్ఞాని. అతనికి చర, అచరాల నడుమ భేదమేమీ కని పించదు. ఆత్మనుండి శక్తి లభించినట్లుగా, జ్ఞానం నుండే అమరత్వకరమూ లభిస్తుంది. అతనే జ్ఞానరూపంలో ఆత్మయై నిత్యమూ విరాజిల్లుతాడు.
రావుల నిరంజనాచారి 🙏
No comments:
Post a Comment